హద్దుల్లేని అవినీతి! | Corruption in Integrated check post | Sakshi
Sakshi News home page

హద్దుల్లేని అవినీతి!

Published Wed, Jan 11 2017 12:01 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

హద్దుల్లేని అవినీతి! - Sakshi

హద్దుల్లేని అవినీతి!

ఇచ్ఛాపురం, కంచిలి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని పురుషోత్తపురం ఉమ్మడి తనిఖీ కేంద్రం (ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు)లో అవినీతికి హద్దులేకుండా పోతోంది. అక్రమాలకు చిరునామాగా మారిందనే విమర్శలున్నాయి. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేయడం, తనిఖీలు చేపడుతున్నా ఇక్కడి సిబ్బంది తీరు మారడం లేదు. తాజాగా సోమవారం వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు చెక్‌పోస్టులో ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర నేతృత్వంలో దాడులు చేపట్టి..విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 64 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. డీఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం.. సేల్స్‌ అండ్‌ కమర్షియల్‌  శాఖ పరిధిలోని రెండు కౌంటర్ల నుంచి రూ. 30 వేలు, మార్కెటింగ్‌ శాఖ పరిధిలోని కౌంటర్‌ నుంచి రూ. 1100, ఎనిమిది మంది ప్రైవేటు వ్యక్తుల నుంచి (దళారులు) రూ. 32,900 స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీలో డీఎస్పీతోపాటు సీఐ, 15 మంది స్పెషల్‌పార్టీ పోలీసులు పాల్గొన్నారు. సోమవారం వేకువజామున 4:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు చెక్‌పోస్టు ప్రాంగణంలో తనీఖీలు, రికార్డులు పరిశీలన చేశారు. అక్రమ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపారు.

తరచూ దాడులు
ఉమ్మడి తనిఖీ కేంద్రంపై తరచూ ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. 2015 డిసెంబర్, 2016 జనవరి, మార్చి, జూన్, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో ఒక్కోసారి దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు. లక్షలాది రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం కూడా తనిఖీ చేపట్టి 64 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.  

కొరియార్‌ బాయ్స్‌తో అక్రమ వసూళ్లు
ఈ చెక్‌పోస్టు వ్యవహారాల్లో వాస్తవంగా ప్రభుత్వ శాఖల సిబ్బంది కంటే ప్రైవేటు వ్యక్తుల ప్రమేయమే ఎక్కువగా కన్పిస్తోంది. ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు సహాయకులుగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని వారితోనే ఈ దందా అంతా సాగిస్తున్నారు. సోమవారం ఏసీబీ అధికారులు చేసిన దాడిలో ఎనిమిమంది ప్రైవేటు వ్యక్తులు పట్టుబడ్డారు. ప్రైవేటు వ్యక్తులను కొరియర్‌ బాయ్స్‌గా పిలుస్తారని ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర పేర్కొన్నారు. వీరితోనే అన్ని అక్రమ కార్యకలాపాలు ఇక్కడి సిబ్బంది చేయిస్తున్నారన్నారు.   

తనిఖీలు నామమాత్రం!
ఈ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ నామమాత్రంగానే జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది సిబ్బంది తనిఖీల కంటే వసూళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే విమర్శలున్నాయి. చెక్‌పోస్టు పరిధిలో లావాదేవీలు జరుపుతున్న పలు శాఖల కౌంటర్లలో లారీ డ్రైవర్ల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు సిబ్బంది పాల్పడుతున్నారు. ఈ విషయం పలుమార్లు జరిపిన తనిఖీల్లో తేటతెల్లమయ్యింది. దీన్ని అరికట్టేందుకు ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు అనేకసార్లు తనిఖీలు జరిపి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. ఇక్కడ జరుగుతున్న అవినీతికి కొంతమంది ప్రముఖుల అండదండలు కూడా ఉండడమే సిబ్బందిలో మార్పు రాకపోవడానికి కారణంగా ఈ ప్రాంతీయులు చెబుతుంటారు. చెక్‌ పోస్టు పరిధిలో విధులు నిర్వహించే పలు శాఖల అధికారులు, సిబ్బందితోపాటు పెద్ద ఎత్తున ప్రైవేటు సైన్యం కూడా బినామీలుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వాస్తవంగా వివిధ శాఖల కౌంటర్లలో ఉండాల్సిన అధికారిక సిబ్బందికంటే ప్రైవేటు వ్యక్తులే అన్ని పనులు చక్కబెడతారు. ఏసీబీ అధికారులు దాడులు చేసే సమయాల్లో ప్రతిసారీ ప్రైవేటు సైన్యం నుంచే అక్రమవసూళ్లు లభ్యమవుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

చేయి తడపాల్సిందే..
  పురుషోత్తపురం చెక్‌పోస్టు మీద నుంచి వివిధ రాష్ట్రాలకు వచ్చి, పోయే వాహనాలకు సంబంధించి పత్రాలు మాత్రమే సిబ్బంది తనిఖీ చేస్తారు. ఫిజికల్‌ వెరిఫికేషన్లు చేపట్టడం అరుదని లారీ డ్రైవర్లే చెబుతుంటారు. లారీలోని సరుకుకు సంబంధించిన పత్రాలు, వాటి అనుమతులను ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు కార్యాలయం వద్దకు తీసుకొచ్చే లారీ ఆపరేటర్లు అక్కడి సిబ్బందికి ఎంతోకొంత ముట్టచెబితే అనుమతి పత్రాలపై స్టాంప్‌లు వేస్తారనే ఆరోపణలున్నాయి.  

పాతుకుపోయిన ఉద్యోగులు
 చెక్‌పోస్టులోని కొన్ని శాఖల్లో పనిచే స్తున్న కిందిస్థాయి ఉద్యోగులు చాలా కాలంగా ఇక్కడే పనిచేస్తూ పాతుకుపోయారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలకు కర్త, కర్మ, క్రియలుగా వీరే వ్యవహరిస్తారనే ఆరోపణలున్నాయి. ఏ అధికారి వచ్చినా వారికి తలలో నాలుకలా వ్యవహరిస్తూ, అక్కడ వసూళ్లు జరిగే సమయంలోను, ఎవరైనా పరిశీలించటానికి వచ్చేటప్పుడు వీరు సీన్‌లోకి వచ్చి ఆ సమస్య సమసిపోయే విధంగా డీల్‌ చేయటం సర్వసాధారణమైన విషయంగా మారింది. ఇలాంటి వారు ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడడం, వీరిపై కేసులు నమోదు అవుతున్నప్పటికీ... ఇక్కడ నుంచి వారిని బదిలీ కూడా చేయడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement