ఇచ్ఛాపురం (కంచిలి): పాలనా పరమైన విషయాల్లో అవినీతిని అంతమొందిస్తున్నాం.. పారదర్శకతతో పనిచేస్తున్నామని పాలకులు చేసే ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తంతుకు పొంతన లేకుండా పోయింది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావల్సిన ఆదాయం కొందరు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోవటం నిత్యకృత్యంగా మారింది. దీనికి ఇచ్ఛాపురం పరిధిలోని పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో సాగుతున్న తంతును ఉదాహరణగా చెప్పవచ్చు. మూడేళ్లలో ఈ చెక్‌పోస్టులో అవినీతి అంతమొందించటానికి చేసిన ప్రయత్నాలేవి సఫలీకృతం కాలేదు.
కానరాని సరుకుల తనిఖీలు!
ఈ చెక్‌పోస్టు పరిధిలో కమర్షియల్ అండ్ సేల్స్ ట్యాక్స్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, రవాణాశాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, సివిల్‌సప్లైస్, అటవీశాఖ, మైన్స్ అండ్ జియాలజీ శాఖల కౌంటర్లు ఉన్నారుు. వాహనాల్లో వచ్చే సరకులకు సంబంధించి అన్ని అనుమతులు, పన్నులు చెల్లింపు జరిపారో లేదో అనే విషయాలను తనిఖీలు చేయూలి. ఈ శాఖల ఆధ్వర్యంలో వచ్చి, పోయే వాహనాల్లో ఏం రవాణా చేస్తున్నారు, కాగితాల్లో చూపెట్టిన ప్రకారం సరుకు నిల్వలు ఉన్నాయో, అధికంగా ఉన్నాయో, ఒకదానికి బదులు మరో సరకు రవాణా అవుతోందో నిశితంగా పరిశీలించాల్సి ఉంది. కానీ ఇక్కడ చెక్‌పోస్టులో ఏ శాఖకు సంబంధించి అటువంటి నిశిత పరిశీలన జరగటంలేదనేది ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
పన్నుల చెల్లింపు పైనే దృష్టి
ఈ చెక్‌పోస్టు వద్ద నిఘా కేవలం పన్నులు చెల్లించారా లేదా అనే అంశంపైనే దృష్టి కేంద్రీకరించేలా ఉంటుంది. దీంతో నిషేధిత వస్తువులు చెక్‌పోస్టు మీదుగా దర్జాగా రవాణా అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గుట్కాలు, ఖైనీలు వంటివి పశ్చిమబెంగాల్, ఒడిశాప్రాంతాల నుంచి విజయనగరం మార్కెట్‌కు తరలిపోతున్నట్టు ఎప్పట్నుంచో ఆరోపణలున్నాయి. వారానికి ఒకరోజు ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన వాహనంలోనే అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం.
అరుుతే దీన్ని అరికట్టాల్సిన చెక్ పోస్టు సిబ్బంది అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. వాహన పత్రాలు నామమాత్రంగా తనిఖీ చేస్తుంటారు. ఈ వాహనం పాస్ చేయటానికి పెద్దమొత్తంలో చేతులు మారుతున్నట్లు స్థానికంగా ఆరోపణలున్నాయి. మరోవైపు ఒడిశా ప్రాంతానికి వెళ్లేందుకు, ఆంధ్రాలోకి వచ్చేందుకు చీకటిపేట రహదారి నల్లకుబేరులకు రాచమార్గంలా తయారైంది.
ఇక్కడ ఏఎంసీకి చెందిన చెక్‌పోస్టు ఉన్నప్పటికీ అక్రమాలు ఆగడం లేదు. ఈ మార్గంలో కిరాణా సరకులు, నిషేధిత వస్తువులు, ఆంధ్రా, ఒడిశాలకు అమ్మకం పన్ను హెచ్చుతగ్గులు ఉన్నటువంటి సరకులను సునాయాసంగా రవాణా చేస్తుంటారు. ముఖ్యంగా ధాన్యాన్ని ఒడిశా నుంచి పెద్ద ఎత్తున బినామీ రైతుల గుర్తింపు పత్రాలతో వేబిల్లులు తయారు చేసి ఈ మార్గంలో రవాణా చేస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా విన్పిస్తున్నాయి. ఈ దశలో ఇక్కడ మార్కెట్ కమిటీతోపాటు, కమర్షియల్ ట్యాక్స్ విభాగాల అధికారులు కాపుకాసి తనిఖీలు చేపట్టినా ఫలితం లేదు.
దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్‌వన్...
దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని చెక్‌పోస్టులు కంటే పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్దే కొన్ని శాఖల కౌంటర్లలో అధిక మొత్తాల్లో అక్రమ వసూలు చేస్తున్నారని లారీ ఆపరేటర్లు చెబుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు దాడులు, తనిఖీలు చేపట్టినా ఫలితం లేకపోయిందనే వాదనే విన్పిస్తోంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావల్సిన ఆదాయం కంటే పక్కదారి పట్టే ఆదాయమే ఎక్కువగా ఉంటుందనే ఆరోపణలున్నారుు.
ఆగని ప్రైవేటు సైన్యం దందా
పురుషోత్తపురం చెక్‌పోస్టులో అధికార యంత్రాంగం అవినీతికి తోడుగా ప్రైవేటు సైన్యం దందా పెద్ద ఎత్తున సాగుతోంది. వాహనదారులు లారీలు ఆపి తమ కాగితాలు చూపించి, అనుమతులు పొంది వెళ్లాల్సి ఉండగా, ప్రైవేటు వ్యక్తులు ఆ అవకాశం ఇవ్వకుండా ద్విచక్ర వాహనాల్లో లారీల వద్దకు వెళ్లి వారే కాగితాలు తీసుకొని, కౌంటర్ల వద్ద నామమాత్రపు తనిఖీలు చేయిస్తుంటారు. వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతుండటం ఇక్కడ నిత్యకృత్యంగా జరుగుతోంది. కేవలం అక్రమ దందామీదే వందలాది మంది జీవనం సాగిస్తున్నారు. వీరిని అదుపుచేసే చర్యలు చెక్‌పోస్టు అధికారులు చేపట్టడంలేదు. శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు చేసి ఐదుగురు ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేశారు. అలాగే వాహన యజమానుల నుంచి అదనంగా వసూలు చేసిన 45,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని చూస్తే ప్రైవేటు వ్యక్తుల హవా ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మాకేటి సిగ్గు!
Published Sun, Jun 5 2016 8:35 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement