- రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి చేపలు
– డాక్యుమెంట్ రైటర్లే బాసులు
– అందినకాడికి దండుకుంటున్న వైనం
– ఏసీబీ వలలో చిక్కిన కాకినాడ రిజిస్ట్రార్ బాలప్రకాశ్
– గతంలో ఇక్కడ డీఐజీగా పని చేసిన వైనం
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్.. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో ఇదీ ఒకటి. రెవెన్యూ ఏ స్థాయిలో వస్తుందో అదే స్థాయిలో అక్రమాలూ సాగుతున్నాయి. ప్రతి పనికీ ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల సాయంతో ‘మాఫియా’ను తలపిస్తున్నారు. ఇక్కడ డీఐజీగా పని చేసిన బాలప్రకాశ్ కాకినాడలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన గతంలో ఇక్కడ డీఐజీగా పని చేశారు. ఆ సమయంలోనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లోనే ఏసీబీ వల పన్నినా తప్పించుకుని బదిలీపై వెళ్లిపోయారు.
అనంతపురం టౌన్ : జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు అవినీతి, అక్రమాలకు నిలయంగా మారాయి. ఇక్కడ పైసలివ్వందే పని జరగదన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. జిల్లాలో అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లాలు ఉన్నాయి. అనంతపురం పరిధిలో గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, పామిడి, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అనంతపురం, అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, హిందూపురం పరిధిలో బుక్కపట్నం, చిలమత్తూరు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, తనకల్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి.
అనంతపురం, అనంతపురం రూరల్, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం, తాడిపత్రి, బుక్కపట్నం, చిలమత్తూరు, కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. వీటి పరిధిలోనే 250 నుంచి 300 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు పని చేస్తున్నారు. మెజార్టీ రైటర్లు వృత్తినే నమ్ముకొని ఉండగా.. కొందరు మాత్రం ‘వసూల్ రాజా’లుగా తయారవుతున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. పారిశ్రామికంగా పేరొందిన హిందూపురం ప్రాంతం బెంగళూరుకు సమీపంలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అనంతపురంలోనూ ఇదే పరిస్థితి. మిగిలిన పట్టణ ప్రాంతాల్లోనూ సామాన్యులు భూములు, స్థలాలు కొనలేని పరిస్థితులు ఉన్నాయి.
అలా వెళ్తేనే పని జరిగేది..!
రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతంగా పభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు చలానా తీస్తే అవసరమయ్యే స్టాంప్ పేపర్లను సరఫరా చేస్తారు. కానీ డాక్యుమెంట్ రైటర్లు చలానాకు పది శాతం వరకు అధికంగా పెంచేసి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇవి కాకుండా కార్యాలయ ఖర్చుల పేరుతో మరో రూ.వెయ్యి తీసుకుంటున్నారు. డాక్యుమెంట్లు తయారు చేసినందుకు రూ.1000 నుంచి రూ.1500 అదనంగా ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకుంటే పని సజావుగా సాగనివ్వరు. కార్యాలయాల్లో అధికారులకు ఇవ్వాలని చెబుతూ నేరుగా వసూళ్లకు పాల్పడుతున్నారు.
అధికారులు కూడా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళ్లినవారికే పనిచేస్తున్నారు. అధికారులు, రైటర్లు, స్టాంప్‌వెండర్లు కలిసి నిలువునా దోచుకుంటున్నా..పట్టించుకునే వారు కరువయ్యారు. కార్యాలయాల్లో ప్రజల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అవి ఎక్కడా కనిపించడం లేదు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రజలకు వెసులుబాటు కలిగేలా ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని తెచ్చినా ఫలితం లేకుండాపోతోంది. ఇక స్టాంపు వెండర్ల అక్రమాలకు సైతం చెక్ పడటం లేదు. అవసరాన్ని బట్టి అసలు ధరకంటే 20 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు.
అప్పుడు తప్పించుకుని..!
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అనంతపురం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పని చేసిన బాలప్రకాశ్ బుధవారం కాకినాడలో రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏడాది క్రితం ఈయన్ను కమిషనర్ అండ్ ఐజీ (హైదరాబాద్) కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ తర్వాత రివర్షన్‌పై కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా ఏసీబీకి దొరికారు. ఆయన రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు కల్గివున్నట్లు గుర్తించారు. ఆయన మన జిల్లాలో పని చేసిన సమయంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలున్న అధికారులపై విచారణ జరగకుండా చూడటం, ఫిర్యాదులొస్తే ఆ విషయాన్ని సదరు అధికారులకు చెప్పి వసూళ్లకు పాల్పడటం వంటివి చేసినట్లు తెలుస్తోంది. అప్పుడే ఏసీబీ అధికారులు దృష్టి సారించగా.. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయారు.
పైసలివ్వందే పని జరగదు!
Published Fri, Apr 14 2017 11:04 PM | Last Updated on Sat, Sep 22 2018 8:31 PM
Advertisement