regestration department
-
స్టాంప్ డ్యూటీకి ‘ఫ్రాంకింగ్’ తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ శాఖలో ఫ్రాంకింగ్ మిషన్ సేవలు అందని ద్రాక్షగా తయారయ్యాయి. డిజిటలైజేషన్ సేవలను మరింత సులభతరం చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించేందుకు ఫ్రాంకింగ్ మిషన్లు అందుబాటులో తెచ్చినప్పటికీ ఆచరణలో అమలు నిర్లక్ష్యానికి గురవుతోంది. పాత మిషన్లు మొరాయిస్తుండటంతో ఆధునిక యంత్రాల సరఫరా జరిగినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో వినియోగంలోకి తేవడం లేదు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మొక్కుబడిగా పనిచేస్తుండగా, మరికొన్నింటిలో మూలన పడిపోయాయి. ఫలితంగా దస్తావేజుదారులు ప్రైవేటు ఫ్రాంకింగ్ మిషన్లను ఆశ్రయించక తప్పడం లేదు. స్టాంప్ డ్యూటీ కడితేనే.. ఇళ్లు, వాహనాల కొనుగోలుకు బ్యాంకులు, ఇతర గుర్తింపు పొందిన ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నవారు నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 0.5 శాతం హైపోతిక్ చార్జీ (స్టాంప్ డ్యూటీ) చెల్లించాల్సి ఉంటుంది. ఇది చెల్లించిన తర్వాతనే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాన్ని విడుదల చేస్తాయి. రూ.1000 లోపు అయితే స్థానికంగా ఉండే లైసెన్స్డ్ స్టాంప్ వెండర్ల వద్ద చెల్లించవచ్చు. అంతకన్నా మించి అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డబ్బులు తీసుకున్న తర్వాత ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా ముట్టినట్టు స్టాంప్ వేసి ఇస్తారు. నిండా నిర్లక్ష్యం.. ఫ్రాంకింగ్ మిషన్‌లో డిపాజిట్ చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దస్తావేజుదారులు ఆరోపిస్తున్నారు. చిన్న డిజిటల్ యంత్రమైన ఫ్రాంకింగ్ మిషన్‌ను ఎప్పటికప్పుడు రీచార్జి చేయించాల్సి ఉంటుంది. రూ.20 లక్షలను ప్రభుత్వానికి ముందస్తుగా డిపాజిట్ చేస్తే అంత విలువైన స్టాంపుల స్టాంపింగ్‌కు కావాల్సిన ముడిసరుకును (ఇంక్) సరఫరా అవుతోంది. అయిపోతే మళ్లీ చార్జీ చేసుకోవాలి. ప్రైవేటు స్టాంప్ వెండర్ల విషయంలోనూ ఇదే విధంగా ఉంటుంది. ఆయితే వారి దగ్గర రూ. వెయ్యికి మించి స్టాంపింగ్‌కు వీలు లేదు. రిజిస్ట్రేషన్ అధికారులు మిషన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు వెంటనే మరమ్మతు చేయించకపోవడమే కాకుండా రీచార్జి చేయించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆదాయం సమకూరుతున్నా.. ప్రస్తుతం రూ.100 మించిన స్టాంపులను అమ్మడం లేదు. స్టాంప్ డ్యూటీకి సరిపడా స్టాంపులను కొనుగోలు చేయడం కష్టమవుతోంది. ఆ మొత్తాన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లిస్తే అందుకు సరిసమానమైన స్టాంప్‌ను ఈ ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా వేస్తారు. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు నెలకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు రుణాలు ఇస్తుంటాయి. ఈ రుణాల మంజూరుకు ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కింద నెలకు భారీగా ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ అవసరమైన ఫ్రాంకింగ్ మిషన్ల నిర్వహణపై శ్రద్ధ కనబర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. (చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!) -
రిజిస్ట్రేషన్లు, ఆదాయంలో... రాష్ట్రం రియల్ రికార్డు
సాక్షి, అమరావతి: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు, ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2021–22లో ఏకంగా రూ.7,327.24 కోట్ల ఆదాయాన్ని (35 శాతం వృద్ధి) అర్జించింది. ఒక్క మార్చి నెలలోనే రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఇది నిదర్శనంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రియల్ బూమ్‌తో రికార్డులు సృష్టించామని గొప్పలు చెప్పుకున్న టీడీపీ హయాంతో పోల్చితే ఈ ఆదాయం చాలా ఎక్కువ కావడం విశేషం. కోవిడ్‌తో ఆర్థిక పరిస్థితులు తల్లకిందులైనా 35 శాతం వృద్ధి రేటు నమోదైంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళుతుందనేందుకు ఇదే ఉదాహరణ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ పాలనలో ఏ సంవత్సరమూ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.5 వేల కోట్లు దాటలేదు. 2014లో 13.70 లక్షలు మాత్రమే ఉన్న రిజిస్ట్రేషన్లు తాజాగా 20.76 లక్షలు దాటాయి. దీన్నిబట్టి స్థిరాస్తి లావాదేవీలు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. దూకుడు ఇలా.. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 59.15% వృద్ధి రేటుతో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలవగా 7.40 శాతం వృద్ధితో అనంతపురం చివరి స్థానంలో ఉంది. ఎక్కువ ఆదాయం విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి లభించింది. విశాఖపట్నం జిల్లా నుంచి రూ.1,117.45 కోట్ల అత్యధిక ఆదాయం లభించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అతి తక్కువగా రూ.203.61 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి నిదర్శనం రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరగడం శుభ పరిణామం. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇది నిదర్శనం. రిజిస్ట్రేషన్ల శాఖలో పలు మార్పులు తెచ్చాం. ప్రజల సంక్షేమం, మెరుగైన సేవలందించేందుకు కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్లే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూ.7327.24 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరింది. – రజత్ భార్గవ, ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ (స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్) సత్వర సేవలతోపాటు ఆదాయం ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు మెరుగైన ఆదాయాన్ని సాధించాం. ఆదాయానికి గండి పడుతున్న చోట కొద్దిపాటి మార్పులతో సత్ఫలితాలు వచ్చాయి. – వి.రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ (చదవండి: చైనా చదువులపై తస్మాత్ జాగ్రత్త) -
పైసలివ్వందే పని జరగదు!
- రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి చేపలు – డాక్యుమెంట్ రైటర్లే బాసులు – అందినకాడికి దండుకుంటున్న వైనం – ఏసీబీ వలలో చిక్కిన కాకినాడ రిజిస్ట్రార్ బాలప్రకాశ్ – గతంలో ఇక్కడ డీఐజీగా పని చేసిన వైనం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్.. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో ఇదీ ఒకటి. రెవెన్యూ ఏ స్థాయిలో వస్తుందో అదే స్థాయిలో అక్రమాలూ సాగుతున్నాయి. ప్రతి పనికీ ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల సాయంతో ‘మాఫియా’ను తలపిస్తున్నారు. ఇక్కడ డీఐజీగా పని చేసిన బాలప్రకాశ్ కాకినాడలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన గతంలో ఇక్కడ డీఐజీగా పని చేశారు. ఆ సమయంలోనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లోనే ఏసీబీ వల పన్నినా తప్పించుకుని బదిలీపై వెళ్లిపోయారు. అనంతపురం టౌన్ : జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు అవినీతి, అక్రమాలకు నిలయంగా మారాయి. ఇక్కడ పైసలివ్వందే పని జరగదన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. జిల్లాలో అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లాలు ఉన్నాయి. అనంతపురం పరిధిలో గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, పామిడి, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అనంతపురం, అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, హిందూపురం పరిధిలో బుక్కపట్నం, చిలమత్తూరు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, తనకల్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అనంతపురం, అనంతపురం రూరల్, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం, తాడిపత్రి, బుక్కపట్నం, చిలమత్తూరు, కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. వీటి పరిధిలోనే 250 నుంచి 300 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు పని చేస్తున్నారు. మెజార్టీ రైటర్లు వృత్తినే నమ్ముకొని ఉండగా.. కొందరు మాత్రం ‘వసూల్ రాజా’లుగా తయారవుతున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. పారిశ్రామికంగా పేరొందిన హిందూపురం ప్రాంతం బెంగళూరుకు సమీపంలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అనంతపురంలోనూ ఇదే పరిస్థితి. మిగిలిన పట్టణ ప్రాంతాల్లోనూ సామాన్యులు భూములు, స్థలాలు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. అలా వెళ్తేనే పని జరిగేది..! రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతంగా పభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు చలానా తీస్తే అవసరమయ్యే స్టాంప్ పేపర్లను సరఫరా చేస్తారు. కానీ డాక్యుమెంట్ రైటర్లు చలానాకు పది శాతం వరకు అధికంగా పెంచేసి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇవి కాకుండా కార్యాలయ ఖర్చుల పేరుతో మరో రూ.వెయ్యి తీసుకుంటున్నారు. డాక్యుమెంట్లు తయారు చేసినందుకు రూ.1000 నుంచి రూ.1500 అదనంగా ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకుంటే పని సజావుగా సాగనివ్వరు. కార్యాలయాల్లో అధికారులకు ఇవ్వాలని చెబుతూ నేరుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారులు కూడా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళ్లినవారికే పనిచేస్తున్నారు. అధికారులు, రైటర్లు, స్టాంప్‌వెండర్లు కలిసి నిలువునా దోచుకుంటున్నా..పట్టించుకునే వారు కరువయ్యారు. కార్యాలయాల్లో ప్రజల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అవి ఎక్కడా కనిపించడం లేదు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రజలకు వెసులుబాటు కలిగేలా ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తెచ్చినా ఫలితం లేకుండాపోతోంది. ఇక స్టాంపు వెండర్ల అక్రమాలకు సైతం చెక్ పడటం లేదు. అవసరాన్ని బట్టి అసలు ధరకంటే 20 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. అప్పుడు తప్పించుకుని..! స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అనంతపురం డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పని చేసిన బాలప్రకాశ్ బుధవారం కాకినాడలో రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏడాది క్రితం ఈయన్ను కమిషనర్ అండ్ ఐజీ (హైదరాబాద్) కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ తర్వాత రివర్షన్పై కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా ఏసీబీకి దొరికారు. ఆయన రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు కల్గివున్నట్లు గుర్తించారు. ఆయన మన జిల్లాలో పని చేసిన సమయంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలున్న అధికారులపై విచారణ జరగకుండా చూడటం, ఫిర్యాదులొస్తే ఆ విషయాన్ని సదరు అధికారులకు చెప్పి వసూళ్లకు పాల్పడటం వంటివి చేసినట్లు తెలుస్తోంది. అప్పుడే ఏసీబీ అధికారులు దృష్టి సారించగా.. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయారు.