సాక్షి, అమరావతి: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు, ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2021–22లో ఏకంగా రూ.7,327.24 కోట్ల ఆదాయాన్ని (35 శాతం వృద్ధి) అర్జించింది. ఒక్క మార్చి నెలలోనే రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఇది నిదర్శనంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రియల్ బూమ్‌తో రికార్డులు సృష్టించామని గొప్పలు చెప్పుకున్న టీడీపీ హయాంతో పోల్చితే ఈ ఆదాయం చాలా ఎక్కువ కావడం విశేషం.
కోవిడ్‌తో ఆర్థిక పరిస్థితులు తల్లకిందులైనా 35 శాతం వృద్ధి రేటు నమోదైంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళుతుందనేందుకు ఇదే ఉదాహరణ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ పాలనలో ఏ సంవత్సరమూ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.5 వేల కోట్లు దాటలేదు. 2014లో 13.70 లక్షలు మాత్రమే ఉన్న రిజిస్ట్రేషన్లు తాజాగా 20.76 లక్షలు దాటాయి. దీన్నిబట్టి స్థిరాస్తి లావాదేవీలు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.
దూకుడు ఇలా..
రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 59.15% వృద్ధి రేటుతో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలవగా 7.40 శాతం వృద్ధితో అనంతపురం చివరి స్థానంలో ఉంది. ఎక్కువ ఆదాయం విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి లభించింది. విశాఖపట్నం జిల్లా నుంచి రూ.1,117.45 కోట్ల అత్యధిక ఆదాయం లభించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అతి తక్కువగా రూ.203.61 కోట్ల ఆదాయం వచ్చింది.
రాష్ట్ర ఆర్థిక వృద్ధికి నిదర్శనం
రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరగడం శుభ పరిణామం. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇది నిదర్శనం. రిజిస్ట్రేషన్ల శాఖలో పలు మార్పులు తెచ్చాం. ప్రజల సంక్షేమం, మెరుగైన సేవలందించేందుకు కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్లే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూ.7327.24 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరింది.
– రజత్ భార్గవ, ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ (స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్)
సత్వర సేవలతోపాటు ఆదాయం
ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు మెరుగైన ఆదాయాన్ని సాధించాం. ఆదాయానికి గండి పడుతున్న చోట కొద్దిపాటి మార్పులతో సత్ఫలితాలు వచ్చాయి.
– వి.రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
(చదవండి: చైనా చదువులపై తస్మాత్ జాగ్రత్త)
Comments
Please login to add a commentAdd a comment