Registration costs
-
రిజిస్ట్రేషన్లూ ఆన్లైన్లోనే.. కర్నూలుకు ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్
ఆస్తుల క్రయ, విక్రయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఓ పెద్ద ప్రహసనం. అడుగడుగునా అవినీతి. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తుల ప్రమేయమూ ఎక్కువే. వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రజలకు సులభంగా.. అత్యాధునిక పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ప్రీమియం రిరిజిస్ట్రేషన్ సర్వీసు సెంటర్లను అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా పాసుపోర్టు సేవా కేంద్రాల తరహాలో కార్పొరేట్ స్థాయి హంగులతో సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో మొత్తం 9 ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్ అండ్‌స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. ఇందులో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా మొదట విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రీమియం రిజస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడ సేవలు విజయవంతం కావడంతో మిగిలిన ఏడు చోట్ల ప్రీమి యం రిజిస్ట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా కర్నూలులో ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ అధికారులు కర్నూలు నగరంలో ప్రజలకు అనువైన ప్రాంతం, 1,000 చదరపు అడుగుల భవనం కోసం అన్వేషణ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి నుంచి ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు.. ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్ ఫ్రంట్ ఎండ్‌లో అవుట్సోర్సింగ్ సిబ్బంది, డేటా ఎంట్రీ అపరేటర్లు ఉంటారు. బ్యాక్ ఎండ్‌లో సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది ఉండి పనిచేస్తారు. మొదట కొద్ది రోజులు ఆఫ్‌లైన్ సేవలు అందించినా.. తర్వాత అన్ని ఆన్లైన్ సేవలే ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు. అంతేకాక ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం సెంటర్‌కు వెళ్లి సింగిల్‌విండో కింద రిక్వెస్టు పెడితే ఆన్లైన్లో సంబంధిత సేవా ప్రక్రియ మొదలవుతుంది. వినయోగదారులే తమ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. అప్పుడు ఆన్లైన్లోనే సబ్ రిజిస్ట్రార్‌కి వెళ్తుంది. సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం ఆస్తుల వివరాలను పరిశీలించి సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఏ మాత్రం ఉండదు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే చేయించుకున్న వారికి పూర్తయినట్లు మెస్సేజ్ వెళ్తుంది. రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువ మదింపు, ఈసీలు, సీసీలు, స్టాంపుల అమ్మకాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అవినీతికి తావుండదు అవినీతి రహిత రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రీమియం సెంటర్ల ముఖ్య ఉద్దేశం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. – కల్యాణి, డీఐజీ, రిజిస్ట్రేషన్ అండ్‌స్టాంప్స్ -
రిజిస్ట్రేషన్లు, ఆదాయంలో... రాష్ట్రం రియల్ రికార్డు
సాక్షి, అమరావతి: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు, ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2021–22లో ఏకంగా రూ.7,327.24 కోట్ల ఆదాయాన్ని (35 శాతం వృద్ధి) అర్జించింది. ఒక్క మార్చి నెలలోనే రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఇది నిదర్శనంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రియల్ బూమ్‌తో రికార్డులు సృష్టించామని గొప్పలు చెప్పుకున్న టీడీపీ హయాంతో పోల్చితే ఈ ఆదాయం చాలా ఎక్కువ కావడం విశేషం. కోవిడ్‌తో ఆర్థిక పరిస్థితులు తల్లకిందులైనా 35 శాతం వృద్ధి రేటు నమోదైంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళుతుందనేందుకు ఇదే ఉదాహరణ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ పాలనలో ఏ సంవత్సరమూ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.5 వేల కోట్లు దాటలేదు. 2014లో 13.70 లక్షలు మాత్రమే ఉన్న రిజిస్ట్రేషన్లు తాజాగా 20.76 లక్షలు దాటాయి. దీన్నిబట్టి స్థిరాస్తి లావాదేవీలు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. దూకుడు ఇలా.. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 59.15% వృద్ధి రేటుతో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలవగా 7.40 శాతం వృద్ధితో అనంతపురం చివరి స్థానంలో ఉంది. ఎక్కువ ఆదాయం విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి లభించింది. విశాఖపట్నం జిల్లా నుంచి రూ.1,117.45 కోట్ల అత్యధిక ఆదాయం లభించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అతి తక్కువగా రూ.203.61 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి నిదర్శనం రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరగడం శుభ పరిణామం. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇది నిదర్శనం. రిజిస్ట్రేషన్ల శాఖలో పలు మార్పులు తెచ్చాం. ప్రజల సంక్షేమం, మెరుగైన సేవలందించేందుకు కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్లే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూ.7327.24 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరింది. – రజత్ భార్గవ, ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ (స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్) సత్వర సేవలతోపాటు ఆదాయం ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు మెరుగైన ఆదాయాన్ని సాధించాం. ఆదాయానికి గండి పడుతున్న చోట కొద్దిపాటి మార్పులతో సత్ఫలితాలు వచ్చాయి. – వి.రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ (చదవండి: చైనా చదువులపై తస్మాత్ జాగ్రత్త) -
నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు
♦ బీఎస్ఎన్ఎల్ అధికారుల అలసత్వంతో ప్రజల అవస్థలు ♦ ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి గుంటూరు రూరల్ : ఓ పక్క రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతుంటే మరో పక్క ఆన్లైన్ పనిచేయక మరిన్ని ఇంబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా నల్లపాడు గ్రామం లో బీఎస్ఎన్ఎల్ సేవలకు అంతరాయం కలగటంతో రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రోడ్డు విస్తరణలో భాగంగా వైర్లు తెగి అన్లైన్ వ్యవస్థ పనిచేయకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలంటున్నారు. బీఎస్ఎన్ఎల్ అధికారుల అలసత్వం వల్లే ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండిపడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
భూమి ధరలకు రెక్కలు
1 నుంచి భారీగా భూముల విలువ పెంపు రిజిస్ట్రేషన్ల ఆదాయంతో ఇక కాసుల పంట గురువారం జోరందుకున్న క్రయవిక్రయాలు విశాఖపట్నం : భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పటికే ల్యాండ్ బ్యాంక్ పేరిట ప్రభుత్వం చేపడుతున్న సేకరణకు తోడు రియల్ ఎస్టేట్ మాఫియా వల్ల భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ధరలు కూడా పెంచనుండడంతో సామాన్యులు గజం భూమి కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా రెండేళ్లకొకసారి మార్కెట్ విలువను ప్రభుత్వం సవరిస్తుంది. రాష్ర్ట విభజన నేపథ్యంలో గతేడాది పెంచలేదు. దీంతో ఈ ఏడాది 20 నుంచి 30 శాతం పెంపునకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ విలువను బట్టి వంద శాతం కూడా పెంచుకునే వెసులుబాటు కల్పించింది. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, బదిలీ సుంకం భారీగా పెరగనుంది. ఫలితంగా ఇళ్ల స్థలాల విలువ, వ్యవ సాయ భూముల విలువ రెట్టింపయ్యే అవకాశముంది. ప్రస్తుతం విశాఖలో ప్రభుత్వ లెక్కల ప్రకారం గజం 15వేల నుంచి రూ.70వేల వరకు ఉంది. మార్కెట్ విలువను బట్టి నగర పరిధిలో 20 నుంచి 80 శాతం వరకు పెరగనుండగా, గ్రామీణ ప్రాంతంలో 20 నుంచి 30 శాతం వరకు పెరగనున్నాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం మేర పెరిగే అవకాశముంది. ఆగ స్టు 1 నుంచి భూముల విలువ పెరగనున్న నేపథ్యంలో పెంపుభారం నుంచి ఉపసమనం పొందేందుకు క్రయవిక్రయ దారులు క్యూ కట్టారు. రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ గురువారం కిటకిటలాడాయి. ప్రతీరోజు జిల్లాలోని 15సబ్రిజిస్ట్రేషన్కార్యాలయాల ద్వారా జరిగే లావాదేవీల ద్వారా సర్కార్‌కు కోటి నుంచి కోటిన్నర వరకు ఆదాయం వస్తుంది. అలాంటిది పుష్కరాలు ముగిసిన మర్నాడు నుంచి జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. రోజుకు 20 నుంచి 50 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. గురువారం ఒక్కరోజే దాదాపు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సరాసరిన 50 నుంచి 120 వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి. జీవీఎంసీ పరిధిలోని ఆటోనగర్, అక్కయ్యపాలెం, పూర్ణమార్కెట్, టర్నర్‌చౌల్ట్రీ, గోపాలపట్నం, గాజువాక, భీమిలిలతో పాటు నర్సీపట్నం, చోడవరం తదితర రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్ని కిటకిటలాడాయి. 2014-15 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాకు రూ.350కోట్లు లక్ష్యంగా నిర్ధేశించగా..రాష్ర్ట విభజన, హుద్‌హుద్ తుఫాన్ల ప్రభావంతో రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల మందగించాయి. దీంతో కేవలం రూ.285 కోట్లకు మించి ఆదాయాన్ని ఆర్జించలేకపోయింది. ఆర్ధిక లోటును సాకుగా చూపి రిజిస్ట్రేషన్ శాఖకు కూడా లక్ష్యాలను సర్కార్ రెట్టింపు చేసింది. 2015-16లో రూ.457కోట్లుగా లక్ష్యాన్ని నిర్ధేశించారు. జాతీయ విద్యాసంస్థలకు తోడు భారీ ఎత్తున పరిశ్రమలు విశాఖకు తరలిరానున్నాయన్న సర్కార్ వ్యూహాత్మక ప్రచారంతో ఇక్కడ భూముల రేట్లు అమాంతం పెరగడంతో క్రయవిక్రయాల జోరు కూడా పెరిగింది. ఈ కారణంగానే గడిచిన నాలుగు నెలల్లో రూ.157కోట్ల ఆదాయన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఆర్జించింది.