భూమి ధరలకు రెక్కలు
1 నుంచి భారీగా భూముల విలువ పెంపు
రిజిస్ట్రేషన్ల ఆదాయంతో ఇక కాసుల పంట
గురువారం జోరందుకున్న క్రయవిక్రయాలు
విశాఖపట్నం : భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పటికే ల్యాండ్ బ్యాంక్ పేరిట ప్రభుత్వం చేపడుతున్న సేకరణకు తోడు రియల్ ఎస్టేట్ మాఫియా వల్ల భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ధరలు కూడా పెంచనుండడంతో సామాన్యులు గజం భూమి కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా రెండేళ్లకొకసారి మార్కెట్ విలువను ప్రభుత్వం సవరిస్తుంది. రాష్ర్ట విభజన నేపథ్యంలో గతేడాది పెంచలేదు. దీంతో ఈ ఏడాది 20 నుంచి 30 శాతం పెంపునకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ విలువను బట్టి వంద శాతం కూడా పెంచుకునే వెసులుబాటు కల్పించింది. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, బదిలీ సుంకం భారీగా పెరగనుంది. ఫలితంగా ఇళ్ల స్థలాల విలువ, వ్యవ సాయ భూముల విలువ రెట్టింపయ్యే అవకాశముంది. ప్రస్తుతం విశాఖలో ప్రభుత్వ లెక్కల ప్రకారం గజం 15వేల నుంచి రూ.70వేల వరకు ఉంది.
మార్కెట్ విలువను బట్టి నగర పరిధిలో 20 నుంచి 80 శాతం వరకు పెరగనుండగా, గ్రామీణ ప్రాంతంలో 20 నుంచి 30 శాతం వరకు పెరగనున్నాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం మేర పెరిగే అవకాశముంది. ఆగ స్టు 1 నుంచి భూముల విలువ పెరగనున్న నేపథ్యంలో పెంపుభారం నుంచి ఉపసమనం పొందేందుకు క్రయవిక్రయ దారులు క్యూ కట్టారు. రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ గురువారం కిటకిటలాడాయి. ప్రతీరోజు జిల్లాలోని 15సబ్‌రిజిస్ట్రేషన్‌కార్యాలయాల ద్వారా జరిగే లావాదేవీల ద్వారా సర్కార్‌కు కోటి నుంచి కోటిన్నర వరకు ఆదాయం వస్తుంది. అలాంటిది పుష్కరాలు ముగిసిన మర్నాడు నుంచి జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. రోజుకు 20 నుంచి 50 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. గురువారం ఒక్కరోజే దాదాపు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సరాసరిన 50 నుంచి 120 వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి. జీవీఎంసీ పరిధిలోని ఆటోనగర్, అక్కయ్యపాలెం, పూర్ణమార్కెట్, టర్నర్‌చౌల్ట్రీ, గోపాలపట్నం, గాజువాక, భీమిలిలతో పాటు నర్సీపట్నం, చోడవరం తదితర రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్ని కిటకిటలాడాయి. 2014-15 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాకు రూ.350కోట్లు లక్ష్యంగా నిర్ధేశించగా..రాష్ర్ట విభజన, హుద్‌హుద్ తుఫాన్‌ల ప్రభావంతో రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల మందగించాయి. దీంతో కేవలం రూ.285 కోట్లకు మించి ఆదాయాన్ని ఆర్జించలేకపోయింది.
ఆర్ధిక లోటును సాకుగా చూపి రిజిస్ట్రేషన్ శాఖకు కూడా లక్ష్యాలను సర్కార్ రెట్టింపు చేసింది. 2015-16లో రూ.457కోట్లుగా లక్ష్యాన్ని నిర్ధేశించారు. జాతీయ విద్యాసంస్థలకు తోడు భారీ ఎత్తున పరిశ్రమలు విశాఖకు తరలిరానున్నాయన్న సర్కార్ వ్యూహాత్మక ప్రచారంతో ఇక్కడ భూముల రేట్లు అమాంతం పెరగడంతో క్రయవిక్రయాల జోరు కూడా పెరిగింది. ఈ కారణంగానే గడిచిన నాలుగు నెలల్లో రూ.157కోట్ల ఆదాయన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఆర్జించింది.