విద్యార్థుల చేతిలోనే దేశ భవిష్యత్
సాక్షి, జనగామ: ‘విద్యార్థుల్లారా మీతోనే దేశ, రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంది. మీరు కాబోయే ఓటర్లు కాబట్టే ఓటు హక్కుపై చైతన్యం కల్పిస్తున్నాం. ఎన్నికలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిం చడం కోసమే ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అన్నారు. ఈనెల 25న జరగనున్న జాతీయ ఓటరు దినోత్స వాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని జడ్పీ హెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో గురువారం విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. కలెక్టర్ శ్రీదేవసేన అధ్యక్షతన జరిగిన ముఖాముఖిలో భన్వర్‌లాల్ మాట్లా డుతూ ఓటు హక్కు సరిగా వినియోగించుకు న్నప్పుడే భవిష్యత్ తరాలు బాగుంటాయ న్నారు. ఒకరి బదులుగా మరొకరు ఓటు వేయకుండా నిరోధించడం కోసం రాబోయే రోజుల్లో ఈ–ఓటింగ్ విధానం అమలు చేసే యోచన ఉందన్నారు. 2019 ఎన్నికల్లో ఈవీఎంతోపాటు ప్రింటింగ్ స్లిప్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈనెల 25న ఏడో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 30వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. గ్రామస్థాయి నుంచి 31 జిల్లా కేంద్రాల వరకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తామని తెలిపారు.