PM Narendra Modi: ఇటు నేను.. అటు ఎవరు?
మహేంద్రగఢ్/పటియాలా: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు అధికారంలోకి రాకముందే ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని, ఆవు పాలు ఇవ్వకముందే నెయ్యి కోసం రగడ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు మారితే దేశం ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. తాను బతికి ఉన్నంతకాలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని చెప్పారు. దేశ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని స్పష్టంచేశారు. ఈ పోరాటంలో ఒకవైపు ప్రజల సేవకుడు మోదీ ఉన్నారని, మరోవైపు ఎవరున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. విపక్ష కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడని పరోక్షంగా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కరడుగట్టిన కులతత్వం, మతతత్వం, బంధుప్రీతితో కూడిన ఇండియా కూటమిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం హరియాణాలోని మహేంద్రగఢ్, పంజాబ్‌లోని పటియాలాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి విపక్షాల కుట్రలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘రామ్ రామ్’ అని జపించినవారిని అరెస్టు చేస్తారని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ మన దేశాన్ని ముక్కలు చేసిందని, ఓటు బ్యాంక్‌ను సంతృప్తిపర్చడానికి రెండు ముస్లిం దేశాలను సృష్టించిందని విమర్శించారు. ఈసారి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరానికి తాళం వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని గుర్తచేశారు. మన ఆరాధన, విశ్వాసాన్ని కాంగ్రెస్ కించపరుస్తోందని దుయ్యబట్టారు. విభజించగా మిగిలిపోయిన భారతదేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లింలకే ఉందని విపక్ష నాయకులు అంటున్నారని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం ఇచి్చన రిజర్వేషన్లను సైతం కాజేయాలని చూస్తున్నారని తప్పుపట్టారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు రాత్రికి రాత్రే ఓబీసీ సరి్టఫికెట్లు ఇచ్చేశారని పేర్కొన్నారు. గత పన్నెండేళ్లలో ఇచి్చన ఆ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసిందని తెలిపారు. ఒకవేళ కోర్టు అడ్డుకోకపోతే ఓబీసీ అన్యాయం జరిగే మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ముస్లింలకు రిజర్వేషన్లకు కలి్పంచాలని కుట్ర పన్నుతున్న ప్రతిపక్షాల నిజస్వరూపం ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి ఓటమి తప్పదన్నారు. ఓటమికి బాధ్యులను చేసేందుకు ఒక బకరా కోసం ఆ కూటమిలో ఇప్పటినుంచే అన్వేషణ మొదలైందని పేర్కొన్నారు.పంజాబ్‌లో అరాచక పాలన పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దందా విచ్చలవిడిగా సాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. పరిశ్రమలు పంజాబ్‌ను వదిలి వెళ్లిపోతున్నాయని, ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, డ్రగ్స్ మాఫియా, షూటర్ గ్యాంగ్‌లు చెలరేగిపోతున్నాయని ధ్వజమెత్తారు. పంజాబ్ మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారని, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీ దర్బార్‌లో హాజరు వేయించుకోవడంతోనే సమయం గడిపేస్తున్నారని ఆక్షేపించారు. అలాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పారీ్టలు పంజాబ్‌లో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇది డ్రామా కాదా? అని మోదీ నిలదీశారు.