హైదరాబాద్ ఆస్పత్రిలో బిడ్డ దుర్గాప్రసాద్ పక్కన తల్లిదండ్రులు రమేష్, హేమలత
ప్రాణబిక్ష పెట్టండి
Published Tue, Jul 19 2016 8:57 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
– అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డకు బ్లడ్ క్యాన్సర్
– చికిత్స చేయించలేక నరకయాతన పడుతున్న తల్లిదండ్రులు
– చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లిన కుటుంబం
– సాయం కోసం ఎదురుచూపు
కవిటి: రోజంతా కష్టపడితే గానీ కడుపు నింపుకోలేని బతుకులు వారివి. సాధారణ జబ్బులకే చికిత్స చేయించలేని దుస్థితి వారిది. పదో తరగతి పాసైన బిడ్డపై ఆశలన్నీ పెట్టుకుంటే విధి వారికి మరోవిధంగా పరీక్ష పెడుతోంది. ఎదుగుతున్న బిడ్డకు బ్లడ్ క్యాన్సర్ సోకిందని తెలియడంతో ఆ దంపతులకు కాళ్లు చేతులు ఆడడం లేదు. స్థోమతకు మించి ఖర్చుచేయాల్సి రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. వివరాల్లోకి వెళితే...
కవిటి కాలనీకి చెందిన రమేష్, హేమలతలు రోజు కూలీలు. ఆ కూలి డబ్బులతోనే కుమారుడు దుర్గాప్రసాద్‌ను పదో తరగతి వరకు చదివించారు. బిడ్డ పదో తరగతి పాసవ్వడంతో తమ కష్టాలు తీరుస్తాడని ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆశ పడ్డారు. కానీ దుర్గా ప్రసాద్‌కు అనారోగ్యం చేసి ఆస్పత్రికి తీసుకువెళ్తే బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. దీంతో ఆ దంపతుల కలలు కల్లలయ్యాయి. బిడ్డకు ఎలా చికిత్స చేయించాలో తెలీక నరకయాతన పడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వెళ్లి అక్కడ క్యాన్సర్ ఆస్పత్రిలో బిడ్డను చేర్పించారు. దుర్గా ప్రసాద్‌ను పరీక్షించిన అక్కడి వైద్యులు వ్యాధి ప్రాథమిక దశలో ఉందని, వైద్యం చేస్తే నయమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయం కాసింత ఊరట కలిగించినా అందుకు రూ.9 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో ఏం చేయాలో వీరికి పాలుపోవడం లేదు. కలలో కూడా అంత మొత్తాన్ని ఊహించుకోని ఆ తల్లిదండ్రులు సాయం అర్థిస్తున్నారు. దాతలు సాయం చేస్తే తమ బిడ్డ బతుకుతాడని కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు 8184855915 , 9010870858 నంబర్లను సంప్రదించాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement