సీపీఐ బస్సు యాత్ర
మంచిర్యాల సిటీ : నిజాం ప్రభుత్వం నుంచి విముక్తి పొందిన తెలంగాణ చరిత్రను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ఈ నెల 11 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గుండా మల్లేశ్, వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. మంగళవారం మంచిర్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 11న ఉదయం 9 గంటలకు నల్లగొండ జిల్లా యాదాద్రి నుంచి బస్సు యాత్ర ప్రారంభమై 17న హైదరాబాద్‌లో ముగుస్తుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బస్సు యాత్రను పురస్కరించుకొని సీపీఐ ఆధ్వర్యంలో జాతాలు, పతాకావిష్కరణలు, అమరవీరులకు నివాళులు ఘటించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 15న ఉదయం 8 గంటలకు బస్సుయాత్ర జైపూర్ మండలంలోని ఇందారం చేరుకుంటుందని, అక్కడి నుంచి 10 గంటలకు మంచిర్యాల, 11 గంటలకు రామకృష్ణాపూర్, 12 గంటలకు సోమగూడెం, ఒంటి గంటలకు బెల్లంపల్లికి చేరుతుందన్నారు. బెల్లంపల్లిలోని తెలంగాణ చౌక్ వద్ద బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.
అలాగే ఈనెల 10న జోడేఘాట్‌లో కొమురం భీమ్‌కు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని 17న హైదరాబాద్‌లోని నిజాంగ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, సభకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, నియోజకవర్గ కార్యదర్శి కలవేని శ్యాంతోపాటు నాయకులు ఎండీ షఫీ, జోగుల మల్లయ్య, పుల్లక్క, లింగమూర్తి, కిషన్‌రావు ఉన్నారు.