చంద్రబాబు తేనె పూసిన కత్తి
సీపీఐ(మావోయిస్టు) ఏపీ కమిటీ ధ్వజం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తేనె పూసిన కత్తి అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) ఏపీ కమిటీ మండిపడింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో జరిగిన ఎన్‌కౌంటర్ పచ్చి బూటకమని ఆగ్రహం వ్యక్తం చేసింది. మత్తు మందులు కలిపిన పదార్థాలను కోవర్టుల ద్వారా మావోయిస్టులకు తినిపించి దారుణానికి ఒడిగట్టారని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏఓబీలో జరిగిన హత్యాకాండకు చంద్రబాబు, అతడి హంతక పోలీసు ముఠా కారణమని పేర్కొంది. 15 ఏళ్లపాటు వందలాది హత్యలు చేయించిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టింది.
తొమ్మిదేళ్లు రక్తం వాసనకు దూరంగా ఉన్న చంద్రబాబు గద్దెనెక్కిన మరుసటి రోజే 21 మంది ఎర్రచందనం కూలీలను దుర్మార్గంగా తన పోలీసులతో హత్య చేయించారని విమర్శించింది. రక్తం రుచిమరిగిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పన్నిన పన్నాగమే ఏఓబీ హత్యాకాండ అని స్పష్టం చేసింది. పోలీసు బలగాలతో వేలాది మందిని బలి తీసుకుంటున్న చంద్రబాబు, ఆయన కుమారుడు తప్పించుకోలేరని, అవసరమైతే ఆత్మాహుతి దాడి చేసి చంపుతామని హెచ్చరించింది. ప్రజల నెత్తురు తాగే చంద్రబాబుకు శిక్ష విధించి తీరుతామని తేల్చిచెప్పింది. ఈ ప్రకటనలో సీపీఐ(మావోయిస్టు) కమిటీ ఏమందంటే..
ద్రోహులను శిక్షిస్తాం..
మావోయిస్టులు తినే ఆహార పదార్థాల్లో కోవర్టుల ద్వారా మత్తుమందు కలిపారు. రాత్రి భోజనం తరువాత ఒక్కొక్కరుగా పడిపోయిన వారిపై పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. గాయపడిన కొందరిని మరో ప్రదేశంలో దాచి చిత్రహింసలకు గురిచేశారు. మంగళవారం నలుగురిని కాల్చి చంపారు. ప్రమాదవశాత్తు నీళ్లలో జారిపడి మరణించిన పోలీస్ కానిస్టేబుల్ మరణాన్ని ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారు. మావోయిస్టు పార్టీలో కొద్ది కాలంపాటు పనిచేసి బయటకు వెళ్లిన కొందరు మాజీలు డబ్బు, విలాసాల కోసం ప్రభుత్వంతో, పోలీసులతో చేతులు కలిపారు. పార్టీకి ద్రోహులుగా మారిన మాజీలను కఠినంగా శిక్షిస్తాం. అలాంటి ద్రోహుల చిట్టా తయారు చేయాల్సిందిగా ఇప్పటికే పార్టీ నాయకత్వం జిల్లా కమిటీలను ఆదేశించింది.