- పోలీస్ స్టేషన్‌లోనే సీపీఎం నేతల నిరాహార దీక్షలు
- సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తల ధర్నాలు
విజయవాడ
ప్రజా రాజధాని అని చెప్పే అమరావతిలో ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు వస్తున్నారంటే చాలు.. ప్రజలపైన, ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 10 పర్యాయాలకు పైగా ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు.. రాజధాని గ్రామాల్లోని ప్రజలను హడలెత్తిస్తున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులకు సీఎం రావడంతో సీపీఎం నేతలను అదుపులోకి తీసుకోవడం, ప్రజలు, వాహనాల రాకపోకలపై ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు.
అమరావతి డివిజన్ సీపీఎం కార్యదర్శి ఎం.రవిని మంగళగిరిలోను, డివిజన్ నాయకుడు జె.నవీన్‌ప్రకాశ్‌ను తుళ్లూరులోని అతని ఇంటి వద్ద శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సీఎం రాక సందర్భంగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్బంధించడంతో ఆగ్రహించిన రవి, నవీన్‌ప్రకాశ్‌లు స్టేషన్‌లోనే నిరాహార దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరు, మంగళగిరిలో సీపీఎం నేతలు ధర్నాలకు దిగారు. మరోవైపు సీఆర్‌డీఏ వద్ద లెనిన్ సెంటర్‌లో నోటికి నల్లగుడ్డలు కట్టుకుని సీపీఎం నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం రాజధాని ప్రాంత కన్వీనర్ సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ ప్రజా రాజధాని నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రజలపై నిర్బంధ చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. సీఎం పర్యటనకు వచ్చిన ప్రతీసారి ముందస్తు అరెస్టులు చేసి ప్రజలను భయపెట్టాలనుకోవడం సర్కారు అమాయకత్వమే అవుతుందన్నారు. హెలికాప్టర్‌లో వచ్చి పరిశీలించి వెళ్లేపోయే సీఎం కార్యక్రమానికి ఏం ఇబ్బంది వచ్చిందని ముందస్తు అరెస్టులు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. రాజధాని ప్రాంత ప్రజలపై ప్రభుత్వం నిర్బంధాలను ఆపకపోతే టీడీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎట్టకేలకు సీఎం వచ్చి వెళ్లిన చాలా సేపటికి సాయంత్రం సీపీఎం నేతలను పోలీసులు విడుదల చేశారు.