'వైద్య బకాయిలపై ప్రభుత్వానికి సీపీఎం లేఖ'
విజయవాడ : ఎన్టీఆర్ వైద్య సేవల నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.350 కోట్ల బకాయిలను చెల్లించి పేదలకు అందాల్సిన వైద్యసేవలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి.మధు రాసిన లేఖను గురువారం పత్రికలకు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వంతో చర్చలు నిర్వహించినప్పటికీ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నెల 25 నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారని గుర్తుచేశారు. దీంతో వైద్యసేవలు పొందాల్సిన అనేక మంది పేదలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోకపోతే పేదలకు ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యంతో చర్చలు జరిపి, బకాయిలను చెల్లించి వైద్యసేవలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి మధు విజ్ఞప్తి చేశారు.