సీఆర్‌సీ కళాసేవ అభినందనీయం
సీఆర్‌సీ కళాసేవ అభినందనీయం
Published Wed, Mar 29 2017 10:45 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM
-ఎమ్మెల్యే చిర్ల, నటుడు ఎల్బీ శ్రీరామ్
-రాష్ట్రస్థాయి ఉగాది నాటిక పోటీలు ప్రారంభం
రావులపాలెం : అంతరించి పోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు సీఆర్‌సీ కాటన్ కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయం అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రముఖ సినీనటుడు ఎల్బీ శ్రీ రామ్ ప్రశంసించారు. బుధవారం రాత్రి రావులపాలెంలోని కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్(సీఆర్‌సీ) కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో 19వ ఉగాది ఆహ్వాన రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. సీఆర్‌సీ ఏసీ ఆడిటోరియంలో జగ్గిరెడ్డి, శ్రీరామ్ జ్యోతి ప్రజ్వలన చేసి, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాపరిషత్ కన్వీనర్ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు 19 వసంతాలుగా నాటికలను పరిచయం చేస్తు వారిలో ఆలోచన రేకెత్తిస్తున్న సీఆర్‌సీ సేవలు ప్రశంసనీయం అన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం కాలంలో నాటక రంగం కీలక పాత్ర వహించిందన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, ఎల్బీ శ్రీరామ్, సీఆర్‌సీ కార్యవర్గ సభ్యులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. సినీ నటుడు జెన్నీ, రామచంద్రపురం డీఎస్సీ ఎన్‌బీ మురళీకృష్ణ, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, సీఆర్‌సీ అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి ఆశోక్‌రెడ్డి, సేవా విభాగం డైరెక్టర్ కర్రి సుబ్బారెడ్డి, కళాపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, సత్తి రామకృష్ణారెడ్డి(మారుతి), మల్లిడి వీర్రెడ్డి, నల్లమిల్లి వీరాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, మంతెన రవిరాజు, పలివెల త్రిమూర్తులు, మన్యం సుబ్రహ్మణ్శేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన నాటికలు
మొదటిరోజు ప్రదర్శించిన రెండు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. గుంటూరు జిల్లా కట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘గోవు మాలచ్చిమి’ నాటికను చెరుకూరి సాంబశివరావు రచించి దర్శకత్వం వహించారు. ఒకప్పుడు సైకిల్ అద్దెకు తీసుకుని అద్దె చెల్లించేవాళ్ళమని ఇప్పుడు ఆడదాన్ని గర్భాన్ని అద్దెకు తీసుకుని వ్యాపారంగా మార్చి అమ్మతనాన్ని మంటకలుపుతున్నామని ఈ నాటిక ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అద్దె గర్భ వ్యాపారానికి సంకెళ్ళు వేసి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని తెలియజేప్పారు. అనంతరం హైదరాబాద్ శ్రీ మురళీ కళానిలయం వారు ప్రదర్శించిన ‘అం అః కం కః’ నాటిక హాస్యభరితంగా సాగింది. కష్టపడకుండా కోట్లు సంపాదించాలని దురాశతో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి చివరకు బాకీదారులను తట్టుకోలేక చనిపోయినట్టు నాటకం ఆడిన విశ్వపతికి అప్పుల వాళ్ళు ఎలా బుద్ధి చెప్పారో చూపారు. ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రదర్శనలను తిలకించారు. వారికి సీఆర్‌సీ సభ్యులు ఆల్పాహారం ఏర్పాటు చేశారు. పోటీలకు అదృష్టదీపక్, పోల్నాటి గోవిందరావు, బొడ్డు రాజబాబు నాయ్యనిర్ణేతలుగా వ్యవహరించారు.
Advertisement
Advertisement