కటకటాల్లో కసాయి తండ్రి
కూతురుపై తండ్రి పైశాచికత్వం
– డీసీపీఓ సాయంతో పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
–కటకటాలపాలైన కీచక తండ్రి
ఓర్వకల్లు : కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపైనే లైంగిక దాడులకు పాల్పడిన ఓ కీచక తండ్రి కటకటాల పాలయ్యారు. బుధవారం జిల్లా బాలిక సంరక్షణాధికారుల(డీసీపీఓ) సాయంతో బా«ధితురాలు ఓర్వకల్లు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలిలాఉన్నాయి. గ్రామానికి చెందిన చాకలి రాజు (48) భార్య రాణెమ్మ ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి రాజు తాగుడుకు అలవాటుపడి జులాయిగా తిరిగేవాడు. వీరికి ఇద్దరు కూతుర్లు కాగా, పెద్ద కూతురు ఈ ఏడాది çపంచలింగాల కేజీబీవీలో పదో తరగతి పూర్తి చేసింది. చిన్న కూతురు ప్రస్తుతం పంచలింగాల హాస్టల్‌లో పదో తరగతి చదువుతోంది. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల పెద్ద కూతురు పైచదువులకు వెళ్లలేక ఇంటివద్దనే ఉంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో తాగిన మత్తులో ఇంటికి వచ్చిన తండ్రి పెద్దకూతురు వద్దకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. సదరు బాలిక తనకు తెలిసిన ఉపాధ్యాయుడికి జరిగిన అఘాయిత్యంపై సమాచారం ఇచ్చింది. సదరు ఉపాధ్యాయుడు డీసీపీవో అధికారులకు సమాచారమిచ్చారు.ఆ మేరకు అధికారులు గ్రామాన్ని సందర్శించి బాలికను కర్నూలులోని స్వదర్ గృహానికి తరలించారు. మూడేళ్ల నుంచి తన తండ్రి తరచుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు విచారణలో వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రబాబునాయుడు తెలిపారు.