బతుకమ్మ ఆడుతున్న మహిళలు
- కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- -పూల పండగ ప్రారంభం
ఖమ్మం కమాన్‌బజార్ : తెలంగాణ సంస్కృతిని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు నగరంలోని అన్ని డివిజన్ల నుంచి బతుకమ్మలతో కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోగా జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కళాకారుల నృత్య ప్రదర్శన, కోలాటాలు, బతుకమ్మ పాటలతో ర్యాలీ శోభాయమానంగా బస్టాండ్, మయూరిసెంటర్, కాల్వొడ్డు మీదుగా గుంటుమల్లేశ్వరస్వామి దేవాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని పూజించే ఈ పండగ ఔన్నత్యాన్ని భావి తరాలకు అందించాలని కోరారు. ఊరేగింపులో జేసీ దివ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్ కవిత, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు...
మున్సిపాలిటీ నుంచి గుంటుమల్లేశ్వరస్వామి గుడి వరకు సాగిన ప్రదర్శనలో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, కోలాటాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కొంతమంది కళాకారులు తలపై బిందెలు, బతుకమ్మలను పెట్టుకుని పాటలకు అనుగుణంగా చేసిన నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి.