పోలీసు అధికారే సూత్రధారి
పోలీసు అధికారే సూత్రధారి
Published Sun, Dec 4 2016 3:51 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
నగదు మార్పిడి కేసులో మలుపు
టప్పాచబుత్ర క్రైం ఇన్‌స్పెక్టర్ నిందితుడిగా గుర్తింపు
సీఐ, కాంగ్రెస్ నేత కోసం గాలింపు
బంజారాహిల్స్ : పాత కరెన్సీకివ బదులు కొత్త నోట్లు ఇస్తామని రప్పించి బాధితులను బెదిరించి రూ.30లక్షల నగదుతో ఉడాయించిన ఘటనలో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. సీఐతో పాటు అతడి సన్నిహితుడు ఎన్బీటీ నగర్‌కు చెందిన కాంగ్రెస్ నేత తిరుమలేష్ నాయుడు కోసం బంజారాహిల్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టారు.వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎయిర్‌టెల్ సిమ్‌కార్డ్ ఏజెంట్ లక్ష్మణ్ అగర్వాల్‌తో పాటు మరో పది మందిని తిరుమలేష్ నాయుడు గత కొద్ది రోజులుగా ఫోన్‌లో సంప్రదిస్తూ తమ వద్ద పెద్దమొత్తంలో రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లు ఉన్నాయని కొత్త నోట్లు తీసుకొస్తే 15 శాతం కమీషన్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో అగర్వాల్‌తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు గురువారం రూ.1.20 కోట్లు తీసుకుని ఫిలింనగర్ సారుుబాబా దేవాలయం సమీపంలోని సాయిగెస్ట్‌హౌజ్‌కు వచ్చారు.
నోట్ల మార్పిడిలో భాగంగా నోట్లు లెక్కిస్తుండగా టప్పాచబుత్ర క్రైం ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, మరో నలుగురితో సహా యూనిఫాంలో అక్కడికి వచ్చి తుపాకీ చూపి బెదిరించడంతో వారు డబ్బులు అక్కడే వదిలి పారిపోయారు. రెండు గంటల తర్వాత మళ్లీ గెస్ట్‌హౌజ్‌కు వచ్చి చూసుకోగా, అక్కడ ఎవరూ కనిపించకపోగా నగదు కూడా చోరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు టప్పాచభుత్ర క్రై ం ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌ను ఈ నాటకానికి సూత్రధారిగా గుర్తించారు. అతనితో పాటు తిరుమలేష్‌నాయుడు, మల్లేష్, రాజు అనే ఇద్దరు బ్రోకర్లు ఇందులో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. లక్ష్మణ్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 395 కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
అన్నీ వివాదాలే..
ఈ కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టప్పాచబుత్ర డీఐ మూడేళ్ల క్రితం నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సమయంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడ్డాడు. ఆ కేసు నడుస్తుండగానే ఇటీవల టప్పాచబుత్ర డీఐగా బదిలీ అయ్యారు. గతంలో సీసీఎస్‌లోనూ సీఐగా పని చేశారు. 1998 బ్యాచ్‌కు చెందిన రాజశేఖర్ వ్యవహారంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
స్టేషన్‌కు వచ్చి ఆరా
శుక్రవారం ఉదయం నిందితుడు తిరుమలేష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి నగదు చోరీ కేసులపై ఆరా తీశారు. సీఐ శ్రీనివాస్‌ను కలిసి గత కొద్ది రోజులుగా ఎన్బీటీ నగర్‌లో కమీషన్ దందా నడుస్తున్నదని దీనిపై దృష్టి సారించాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఆయన వెళ్లిన రెండు గంటలకే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడికి ఫోన్‌చేయగా వస్తున్నానంటూ రాత్రి 9 గంటల వరకు గడిపాడు. తీరా రాత్రి 11 గంటలకు ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు.
మరో కేసు నమోదు
నిందితుడు తిరుమలేష్‌పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గత నెల 30న అనంతపురం జిల్లాకు చెందిన వెంకటబాబా ,సతీష్, సాయికుమార్, వెంకట్ అనే వ్యక్తులు రూ. 25లక్షల కొత్త కరెన్సీ నోట్లు తీసుకొని ఫిలిమ్‌నగర్‌లోని సాయిగెస్ట్‌హౌజ్‌కు రాగా తిరుమలేష్ నాయుడు తన అనుచరులతో కలిసి వెంకటబాబాపై దాడి చేసి రూ. 12.50 లక్షలు లాక్కుని పరారయ్యాడు. ఈమేరకు బాధితుడు శనివారం బంజారాహిల్స్ పోలీస్‌ష్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement