‘జన్మభూమి’ పాపం.. కార్యదర్శులకు శాపం
Published Tue, Mar 28 2017 1:08 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
దెందులూరు: తెలుగుదేశం పార్టీ పాలనలో మృతులకు పింఛన్లు ఇస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలోని కొందరు మృతులకు పింఛన్ మంజూరు చేయడంతో పాటు పంపిణీ చేసి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారు. రూ.1.79 లక్షలు అవకతవకలు జరిగినట్టు సోషల్ ఆడిట్‌లో అధికారులు గుర్తించారు. పెదవేగి మండలంలో రూ.1.15 లక్షలు, దెందులూరు మండలంలో రూ.39 వేలు, ఏలూరు మండలంలో రూ.22 వేలు, పెదపాడు మండలంలో రూ.3 వేలు దుర్వినియోగమైనట్టు నిర్దారించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు, పింఛన్లు జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే గుడ్డిగా అందిస్తుండటంతో ముగ్గురు కార్యదర్శులు బలయ్యారు. దెందులూరు మండలంలోని దోసపాడు, కేఎన్ పురం, గాలాయిగూడెం గ్రామ కార్యదర్శులు శరత్, ప్రసాద్, అవినాష్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పల్లచింతలపూడి గ్రామ కార్యదర్శిపై చర్యలకు పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదించారు. పై నాలుగు మండలాల్లో జన్మభూమి కమిటీ సభ్యుల సమక్షంలో నిధులు దుర్వి నియోగం జరిగినా దెందులూరు మండలంలో ముగ్గురిపై మాత్రమే వేటు వేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జన్మభూమి కమిటీల ఒత్తిడి మేరకే గ్రామ కార్యదర్శులు మృ తులకు పింఛన్లు మంజూరు చేశారనే విమర్శలూ ఉన్నా యి. ఏలూరు, పెదపాడు, పెదవేగి మండలాల్లో నిధులు దుర్వినియోగానికి కారకులైన గ్రామ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లపై చర్యలకు అధికారులు ఆదేశించినట్టు తెలిసిం ది. దుర్వినియోగమైన మొత్తంలో 90 శాతం నగదును రాబట్టి ట్రెజరీకి జమచేశామని ఎంపీడీఓలు చెబుతున్నారు.
ప్రతి పైసా రికవరీ చేస్తాం
గ్రామ పంచాయతీల్లో మృతులకు పెన్షన్ సొమ్ము మంజూరు చేసి దుర్వినియోగం చేసిన వ్యవహారంలో ప్రతిపైసా ప్రభుత్వ ఖాతాకు జమయ్యేలా రికవరీ చేస్తాం. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వపరంగా త్వరలోనే చర్యలు తీసుకుంటాం.
–శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ, ఏలూరు
చర్యలు ప్రారంభించాం
దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో మృతులకు పెన్షన్‌లు మంజూరు చేసి నిధులు దుర్వినియోగం చేశారని సోషల్ ఆడిట్ అధికారులు ధ్రువీకరించారు. దెందులూరు మండలంలో ఇప్పటికే ముగ్గురు గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేశాం. ఓ కార్యదర్శికి పెనాల్టీ విధించి చర్యల నిమిత్తం పంచాయతీరాజ్ కమిషనర్‌కు సమాచారం అందించాం. మిగతా మూడు మండలాల్లో నిధుల దుర్వినియోగానికి సంబంధించి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం.
– సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి
Advertisement
Advertisement