- కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, రామగుండం ఆసుపత్రుల్లో ఏర్పాటు
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికే మొగ్గు
- టెండర్లను ఆహ్వానించిన ప్రభుత్వం
జిల్లాకు ఐదు డయాలసిస్ యూనిట్లు
Published Wed, Aug 24 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందులో ఐదు యూనిట్లను మన జిల్లాకు కేటాయించింది. జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు సిరిసిల్ల, జగిత్యాల, గోదావరిఖని ఏరియా ఆసుపత్రిల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆసుపత్రుల్లోనే ప్రత్యేకంగా కేటాయించే గదుల్లో డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా ఆసుపత్రులకు వచ్చే కిడ్నీ రోగులకు నిర్ణీత సమయాల్లో డయాలసిస్ సేవలందిస్తారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను రూపొందించింది. ఆయా ఆసుపత్రుల్లో డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి ఈ–టెండర్లు పిలిచింది. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ పరంగా ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా లేదు. కిడ్నీ రోగులకు ఇది ఆశనిపాతమైంది. జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో లేదా హైదరాబాద్ ఆసుపత్రుల్లో వ్యయప్రయాసలకోర్చి డయాలసిస్ చేయించుకుంటున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం తెలంగాణలో ప్రతి 30 నుంచి 35 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీనికయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ డయాలసిస్ కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించడంతోపాటు ఈ మేరకు ఆసక్తి కలిగిన సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లను పిలిచింది. సాధ్యమైనంత త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి డయాలసిస్ కేంద్రాలను రోగులకు అందుబాటులోకి తెస్తామని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. మరోవైపు జిల్లాలో ఇటీవల కాలంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఏటా వేలాది మంది కిడ్నీలు చెడిపోయి మంచం పడుతున్నారు. వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవడం తలకు మించిన భారమవుతోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రోగులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఇందులో డయాలసిస్ చికిత్సను పూర్తిగా ఉచితంగా చేస్తారా? లేక నామమాత్రపు చార్జీలు వసూలు చేస్తారా? అనే దానిపై అధికారుల్లో స్పష్టత లేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటవుతున్నందున చార్జీలు వసూలు చేసే అవకాశాలు లేకపోలేదని సమాచారం.
Advertisement
Advertisement