
రోడ్డెక్కిన పాడిరైతులు
► మదనపల్లె విజయా డెయిరీ వద్ద ధర్నా
► పెండింగ్ పాలబిల్లులపై ఆగ్రహం
► ధరల్లోనూ కోతలంటూ ఆరోపణ
మదనపల్లె రూరల్: పాల బిల్లులు చెల్లింపులో విజయా డెయిరీ విఫల మైందని పాడిరైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రైతులు స్థానిక విజయా డెయిరీ ఎదుట ధర్నా నిర్వహించారు. మదనపల్లె డివిజన్ పరిధిలోని 17 బీఎంసీలకు సరఫరా చేసిన పాలకు సంబంధించి మూడు బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదని తొలుత రైతులు డెయిరీ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందిని బయటకు పంపేశారు. తమకు న్యాయం జరిగేంతవరకూ కార్యాలయంలో పనులు జరగనీయమంటూ బెంగళూరు -మదనపల్లె ప్రధానరహదారిపై బైఠాయించారు. రైతుల ధర్నాకు ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మద్దతు ప్రకటించారు. రైతుల సమస్యపై అధికారులను నిలదీశారు.
వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒకటిన్నర నెలగా పాల బిల్లులు చెల్లించలేదని తెలిపారు. బిల్లుల విషయమై సూపర్‌వైజర్, మేనేజర్‌ను అడిగితే సమాధానం దాట వేస్తున్నారని చెప్పారు. నాణ్యమైన పాలను పంపిస్తున్నా తక్కువ ధరలు వేయడం, నాణ్యత లేదంటూ తిప్పిపంపడం చేస్తూ రైతులకు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు.
విభజన సమస్య : డెయిరీ మేనేజర్
పాడిరైతుల ధర్నా వ ద్ద డెయిరీ మేనేజర్ నవీన్ మాట్లాడుతూ మదనపల్లె డివిజన్‌లో ప్రతి రోజూ 35,000 లీటర్ల పాలు సేకరిస్తున్నామని, 20,000 లీటర్లు హైదరాబాద్‌లోని విజయా డెయిరీకి 15,000 లీటర్లు, టెట్రా ప్యాకింగ్ కోసం కుప్పానికి పంపేవారమని చెప్పారు. విభజన కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య డెయిరీ విషయం తేలకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పాలు నిలిచిపోయాయన్నారు. అలాగే అక్కడి నుంచి బిల్లులు రాలేదని, ఈ కారణంగా చెల్లింపులు ఆలస్యమయ్యాయని వివరించారు. బిల్లుల విషయం ఏపీ డెయిరీ సమాఖ్య మేనేజింగ్ డెరైక్టర్ మురళీ దృష్టికి తీసుకువెళితే పాలను ప్రైవేటు డెయిరీలకు, ఇతర సంస్థలకు అమ్మి చెల్లింపులు జరపమన్నారని, అందులో భాగంగానే డీడీ రమేష్ కోలారు డెయిరీతో మాట్లాడేందుకు వెళ్లారని చెప్పారు.
రోడ్డుపై స్తంభించిన రాకపోకలు
రైతుల ధర్నాతో సుమారు గంటకుపైగా బెంగళూరు మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషా, సీపీఐ నాయకులు కృష్ణప్ప పాల్గొన్నారు. డీడీ అందుబాటులో లేనందున ఆదివారం ఉదయం ఆయనతో బిల్లుల విషయమై చర్చిద్దామని, అప్పటివరకు ఆందోళన విరమించాలని కోరడంతో రైతులు శాంతించారు.