ఫాంహౌస్లో రూ. కోట్లు దాచిన కేసీఆర్
మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో పోలీసులు టీఆర్‌ఎస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్‌తో కలిసి దామోదర రాజనర్సింహ విలేకరులతో మాట్లాడారు. పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.
పోలీసుల అధికారుల తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రికి పోలీసు రక్షణ కల్పిస్తూ కాన్వాయ్‌తో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని విమర్శించారు. అయితే ఉప ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఎస్పీ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఓ డిక్టేటర్‌లా తయారయ్యారన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమా ? కాదా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ ఫాంహౌస్లో రూ.కోట్లు దాచారని, వాటి గురించి మాత్రం పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభ్యులే డబ్బులు పంపిణీ చేస్తున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారన్నారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడతారని రాజనర్సింహ అన్నారు. ఈ విషయాలను మీడియా ప్రజలకు తెలియజేయాలన్నారు. గంగాధర్ అనే రిటైర్డ్ ఉద్యోగి తనింట్లో సొంత డబ్బు దాచుకుంటే పోలీసులు భయభ్రాంతులకు గురిచేసి ఇంట్లోకెళ్లి బీరువా ధ్వంసం చేసి డబ్బులు లాక్కొచ్చారని ఆరోపించారు.