గుట్కా దందాకు సూత్రధారులు వారే..
గుట్టుగా ప్యాకింగ్, సరఫరా
కాశిబుగ్గలో నకిలీ ఉత్పత్తుల తయారీ యూనిట్ ?
హన్మకొండ : ప్రభుత్వ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ... గుట్కా, ఖైనీ ఉత్పత్తుల అక్రమ దందా వరంగల్ నగరం కేంద్రంగా జోరుగా సాగుతోంది. ఈ చీకటి దందా వెనుక ఓ నలుగురు వ్యక్తులు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్నారు. వరంగల్‌లోని పిన్నవారి వీధి, బీట్ బజార్‌లు ప్రధాన కేంద్రాలుగా మూడు ఖైనీలు ఆరు గుట్కాలు అన్న చందంగా వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. కొంగొత్త పోకడలతో జిల్లా నలుమూలలకు ఇక్కడి నుంచే గుట్కా పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నారుు. అంబర్, షేర్, జోడాబైల్ వంటి ఖైనీ తయారీదారులు, పంపిణీదార్లతో సంబంధాలు నెరుపుతూ అక్రమార్కులు గల్లా పెట్టెలు నింపుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఆ నలుగురి గుట్కా దందాలోనూ ఎన్నో రహస్య కోణాలు ఉన్నారుు.
అవి ఏమిటంటే.. ఈ వ్యాపారంలోకి ఒకసారి ప్రవేశించిన వారు ఎవరైనా సరే ఆ నలుగురు సరఫరా చేసే బ్రాండ్లకు సంబంధించిన గుట్కాలు, ఖైనీ, జర్దాలనే కొనాలి. వారి మాటను జవదాటితే వేధింపులు మొదలవుతారుు. పాత బీట్ బజార్‌లోని ఓ దుకాణం కేంద్రంగా ఈ నలుగురు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు వారంతా కలిసి కాశిబుగ్గ ప్రాంతంలో నకిలీ గుట్కా, ఖైనీలు తయారుచేసే యూనిట్ నిర్వహిస్తున్నట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా. అసలే చీకటి వ్యాపారం కావడంతో నకిలీ వస్తువులు అంటగట్టినా ఎదురు చెప్పేవారు లేరు.