
కారుకు బ్రేక్‌లువేయాలి: దత్తాత్రేయ
కూతురి కోసం కేసీఆర్ మోదీ కాళ్లు పట్టుకున్నాడు: రేవంత్
సాక్షి, హన్మకొండ: టీఆర్‌ఎస్ ‘కారు’కు బ్రేకులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ అన్నారు. భూపాలపల్లిలో ఆదివారం జరిగిన ప్రచారసభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలో టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి దేవయ్యను గెలిపించి కేసీఆర్‌కు షాక్ ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో విద్యుత్ సమస్య తలెత్తకుండా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కొత్తగా థర్మల్ పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. సింగరేణి భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి హన్స్‌రాజ్ మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కవితమ్మకు మంత్రి పదవి కోసం అమరావతి పోయి చంద్రబాబు చేతులు, ఢిల్లీకి పోయి మోదీ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు.
కేటీఆర్ ఓ నకిలీ నోటు: రేవంత్
మంత్రి కేటీఆర్ ఓ నకిలీ నోటు అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. భూపాలపల్లిలో ఆదివారం జరి గిన సభలో ఆయన మాట్లాడుతూ... ‘కేటీఆర్ ఓ నకిలీ నోటు. తారకరామరావు అనే నీ పేరు నీది కాదు. టీడీపీది, నీ చదువు అంతా గుం టూరు, పుణేలలో సాగింది. నీ ఉద్యోగం అమెరికాలో... 610 జీవో ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి నువ్వు స్థానికేతరుడివి. ఈ రాష్ట్రంలో చప్రాసీ, బంట్రోతు ఉద్యోగం చేసే అర్హత నీకు లేదు. కానీ నీ తండ్రి నీకు మంత్రివర్గంలో చోటు కల్పించాడు’ అని విమర్శించారు.