Published
Tue, Jul 25 2017 1:11 PM
| Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
కూతుళ్లే..కొడుకులై..
► తండ్రికి దహన సంస్కారాలు చేసిన కూతుళ్లు
బాపట్ల టౌన్: కొడుకులు లేరు. అయితేనేం ఇద్దరు కూతుళ్లే కొడుకులయ్యారు. తమను గుండెలపై పెట్టుకుని చూసుకున్న తండ్రిని..చితి వరకు భుజాలపై మోశారు. కన్నతండ్రి రుణాన్ని ఆయన కట్టె కాలే వరకు తీర్చుకున్నారు. పట్టణంలోని కాకుమానువారిపాలెంకు చెందిన మేరుగ వెంకటేశ్వర్లు (75) తాపీ వర్కర్. శనివారం రాత్రి అనారోగ్యంతో చనిపోయారు. వెంకటేశ్వర్లుకు కొడుకులు లేరు. లక్ష్మి, నాగమణి ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. శనివారం తండ్రి మృతి చెందడంతో బోరున విలపించారు. ‘చిన్నతనంలో అల్లారుముద్దుగా ఎత్తుకు తిప్పిన మా తండ్రిని శ్మశానవాటిక వరకు మేమే మోసుకుపోతామం’టూ పాడినెత్తుకున్నారు. చితి వరకు వెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేశారు.