తండ్రి మృతిని తట్టుకోలేక..
► రైలు కిందపడి అక్కాచెల్లెలు దుర్మరణం..
► మరో యువతి ఆస్పత్రిపాలు
భవానీపురం: విజయవాడ నగరంలోని రాయనపాడు రైల్వేస్టేషన్ వద్ద ముగ్గురు అక్కాచెల్లెళ్లు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో యువతి రైలు పట్టాల పైనుంచి కల్వర్టు కింద పడిపోయి తీవ్రంగా గాయపడింది. ఆమెను గమనించిన స్థానికులు ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన శుక్రవారం వేకువజామున జరిగింది. ఈ ముగ్గురు యువతులు హైదరాబాద్‌కు చెందినవారు. ఉన్నత విద్య అభ్యసించారు. అనారోగ్యంపాలైన తల్లిని ఆస్పత్రిలో చేర్పించి ఆమెకు సపర్యలు చేస్తున్న తండ్రి బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ముగ్గురు అక్కచెల్లెళ్లు రైలుకుందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన లారీ యజమాని షేక్ రఫీకి ముగ్గురు కుమార్తెలు. రఫీ భార్య షోరా సుల్తానా అనారోగ్యానికి గురికావడంతో విజయవాడ సమీపంలోని పోరంకి వద్ద ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నాడు. పోరంకిలోని తన బావమరిది ఇంట్లో ఉంటూ రోజూ ఆస్పత్రికెళ్లి భార్యను చూసివచ్చేవాడు. బుధవారం రాత్రి ఆస్పత్రి నుంచి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని రఫీ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసి హైదరాబాద్ నుంచి ముగ్గురు కుమార్తెలు షాహీన్ సుల్తానా, పర్వీన్ సుల్తానా, రుక్సియా సుల్తానా విజయవాడకు వచ్చారు. తండ్రితో ఉన్న అనుబంధం దృష్ట్యా కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి లేనిది తమకు బతకాలని లేదని బంధువుల వద్ద వాపోయారు.
ఈ క్రమంలో గురువారం సాయంత్రం ముగ్గురు ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. వారికోసం గాలించి కనిపించకపోవడంతో పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా శుక్రవారం తెల్లవారుజామున రాయనపాడు వద్ద రైల్వే ట్రాక్‌పై షాహీన్ సుల్తానా, పర్వీన్ సుల్తానా మృతదేహాలను స్థానికులు కనుగొన్నారు. తీవ్రంగా గాయపడిన రుక్సియా సుల్తానాను స్థానికులు ఆంధ్రా ఆస్పత్రిలో చేర్పించారు. మృతిచెందిన షాహీన్ సుల్తానా బీటెక్ చదివింది. పర్వీన్ సుల్తానా ఎంసీఏ చదువుతోంది. గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రుక్సియా సుల్తానా బీటెక్ చదివిందని, నెల రోజుల క్రితమే అమెరికాకు చెందిన యువకుడితో వివాహం జరిగిందని బందువులు చెబుతున్నారు. వీరి మరణంతో బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు.