మొన్న కావ్య.. నిన్న లోకేశ్..
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఇష్టారాజ్యం..అధికారుల ఉదాసీన వైఖరి వెరసి చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.. నిబంధనలు పాటించడాకుండానే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్సులను తిప్పుతూ చిరుప్రాయాల ప్రాణాలను బలిగొంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే మొన్న కావ్య.. నిన్న లోకేశ్ స్కూల్ వాహన చక్రాల కింద నలిగిపోయారన్నది కఠోర వాస్తవం.
తుర్కపల్లి/సూర్యాపేట మున్సిపాలిటీ: తుర్కపల్లి మండలం నాగపల్లి తండాకు చెందిన ధారవత్ నర్సింహ, శారద దంపతులకు ఐదుగురు సంతానం. కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తెలు సుమిత్ర (రెండో తరగతి), సంధ్య (ఒకటవ తరగతి) నిఖిత (నర్సరీ)లు మండల కేంద్రంలోని పడాల మెమోరియల్ స్కూల్‌లో చదువుతున్నారు. వీరిని ప్రతి రోజు పాఠశాలకు చెందిన బస్సే వచ్చి తీసుకెళ్లి విడిచిపెడుతుంది.
కూతుళ్లను బస్సు ఎక్కించేందుకు వచ్చి..
పడాల మెమోరియల్ స్కూల్‌లో నాగపల్లి తండాకు చెందిన విద్యార్థులే కాకుండా చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు కూడా చదువుకుంటున్నారు. ఈ పాఠశాలకు మొత్తంగా మూడు బస్సులు, ఒక ఆటో ద్వారా విద్యార్థులను పాఠశాలకు చేరవేస్తుంటారు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం 7:30 గంటలకు అదే గ్రామానికి చెందిన డ్రైవర్ బన్సీలాల్ స్కూల్‌బస్సును తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. అదే క్రమంలో తన కూతుళ్లను బస్సులో ఎక్కించేందుకు నర్సింహ కుమారుడు లోకేశ్(2)ను ఎత్తుకుని అక్కడికి వచ్చాడు.
డ్రైవర్ గమనించకుండానే..
నిత్యం నిలిపే చోటు వద్దకు స్కూల్ బస్సు రాగానే ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఒక్కొక్కరుగా అందులోకి ఎక్కుతున్నారు. ఈ క్రమంలో నర్సింహ కూడా సంకలోని కుమారుడిని కిందకు దించి కూతుళ్లను అందులోకి ఎక్కిస్తున్నాడు. ఈ క్రమంలో చిన్న కూతురు నిఖిత ఎక్కకుండానే బస్సు డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని ముందుకు కదిలించాడు. గమనించిన తండ్రి నర్సింహ అరుస్తుండగా వాహనం ముందుకు కదులుతుండగా లోకేశ్‌కు వాహనం తగిలి చక్కాలు అతడి తలపైకి ఎక్కింది. దీంతో తలపగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
కళ్లముందే ఘోరాన్ని చూసి..
అప్పటి వరకు తన సంకలో ఉన్న బాలుడు కళ్లముందే చక్రాల కింద నలిగిపోవడాన్ని చూసిన ఆ తండ్రి గుండెలవిసేలా రోదించి అక్కడే స్పృహకోల్పోయాడు. విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అక్కడికి వచ్చి స్కూల్ బస్సు వాహనాలను ధ్వంసం చేశారు. కొద్దిసేపట్లోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రమాదానికి కారణమైన బస్సుడ్రైవర్ బన్సీలాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మసీయోద్దీన్ తెలిపారు.
హెల్పర్ లేకుండానే..
తుర్కపల్లి మండలం నాగపల్లితండాల్లో, మేళ్లచెరువు మండలం కందిబడలో ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనల్లో లోకేశ్, కావ్యల మృతికి స్కూల్ బస్సుడ్రైవర్ల నిర్లక్ష్యం, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని మెజార్టీ పాఠశాలలు హెల్పర్లు లేకుండానే విద్యార్థులను తమ బస్సులు, వాహనాలలో చేరవేస్తున్నారు. రెండు ఘటనలను నిశితంగా పరిశీలిస్తే కందిబండలో విద్యార్థులు సక్రమంగా సీట్లలో కూర్చున్నారో లేదో అని డ్రైవర్ వెనుకకు చూస్తూ వాహనాన్ని డ్రైవ్ చేయడంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కావ్యను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
ఇక నాగపల్లి తండాలో సైతం పిల్లలు అందరూ ఎక్కారో లేదో చూసుకోకుండా డ్రైవర్ బస్సును ముందుకు కదిలించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే సంబంధిత పాఠశాల యాజమన్యాలు ఆ వాహనాల్లో డ్రైవర్లతో పాటు హెల్పర్లను కూడా నియమిస్తే ఈ ఘటనలు చోటు చేసుకునేవి కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల ప్రారంభంలో హడావుడి చేసే సంబంధిత అధికార యంత్రాంగం నిత్యం కాసింత దృష్టిపెడితే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేది కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం: ఎం. చంద్రశేఖర్‌గౌడ్, డీటీసీ
విద్యాసంస్థల బస్సుల కారణంగా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం. హెల్పర్ లేకుండా బస్సులు నడపడానికి వీల్లేదు. ఫిట్¯ð స్ సర్టిఫికెట్ పొందని బస్సులు రోడ్డు మీద రాకపోకలు సాగించినట్లయితే చట్ట పరంగా మరింత శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ప్రతి బస్సులో హెల్పర్ తప్పనిసరి ఉండాలని ఆదేశాలు జారీ చేశాం.