కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం
ప్రకాశం బ్యారేజీ (తాడేపల్లి రూరల్): కృష్ణానది ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతంలో 16వ కానా గేటు వద్ద సోమవారం స్థానికులు ఓ పురుషుడి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు గేటు కింద భాగంలో వేప్రాన్‌పై ఉన్న మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి వయసు 25 ఏళ్లు ఉండవచ్చని, మాసిపోయిన గడ్డం, బ్లూ కలర్ షర్టుపై చెక్స్, లైట్ బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని ఏఎస్‌ఐ రాజు తెలిపారు. ఆచూకీ తెలిస్తే తాడేపల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు.
హత్యా ? ఆత్మహత్యా ? ప్రమాదమా ?
చనిపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే గేటుపై పడి తీవ్ర గాయాలవుతాయి. మద్యం మత్తులో అయితే తలకిందులుగా పడి తలకు దెబ్బ తగులుతుంది. ఇవేమీ లేకుండా కుడి చేతిపై ఒక్క గాయం మాత్రమే కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి గేటుపై పడితే తీవ్ర గాయాలు కావడమే కాకుండా రక్తస్రావం కూడా అవుతుంది. మృతదేహంపై ఇలాంటి ఆనవాళ్లేమీ కనిపించడం లేదు. మరి ఈ మృతి ప్రమాదమా? హత్యా? ఆత్మహత్యా? వేచి చూడాల్సిందే.
గస్తీ లేదు..
ప్రకాశం బ్యారేజీపై ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తరువాత విజయవాడ, తాడేపల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించడం లేదు. దీంతో విద్యార్థులు, యువకులు, మద్యం బాబులు, ప్రకాశం బ్యారేజీని అడ్డాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.