మృత్యుఘోష
మృత్యుఘోష
Published Wed, Sep 21 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
శ్రీమఠం గోపురంలో ప్రబలిన థ్రిప్స్ వ్యాధి
– వారంలో 10 గోవుల మృత్యువాత
– నిద్రావస్థలో శ్రీమఠం..
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం గోశాలలో మృత్యుఘోష వినిపిస్తోంది. అనారోగ్యంతో రోజుకు రెండు గోవుల చొప్పున మృత్యువాత పడుతున్నాయి. థ్రిప్స్(దోమకాటుతో సోకిన మెదడువాపు వ్యాధి) కారణంగా పట్టిల్లా గోవులు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇన్నాళ్లు పశుగ్రాసం కరువై ప్రాణాలు కోల్పోయిన గోవులను తాజాగా థ్రిప్స్ హరించివేస్తోంది. ఇంత జరుగుతున్నా శ్రీమఠం అధికారుల్లో చలనం కరువైంది.
గోవుల ప్రాణాలకు రక్షణ కరువు
శ్రీమఠం నిర్వహణలో కొండాపురం ఆంజనేయస్వామి ఆలయంలో గోశాల ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం 900 దాకా గోవులున్నాయి. వీటి సంరక్షణ నిమిత్తం దాదాపు 150 ఎకరాల్లో గడ్డి పెంపకం చేపట్టారు. అయితే సరైన వసతులు లేని కారణంగా గోవుల ప్రాణాలకు రక్షణ కరువైంది. నిలువ నీడ లేక ఆవులు ఎండకు ఎండి, వానకు తడిసిపోతున్నాయి. ముఖ్యంగా మైదానం సైతం వర్షపునీరు, గోమూత్ర, పేడతో అపరిశుభ్రంగా తయారైంది. గోశాల నిర్వహణకు ఏటా రూ.25–30 లక్షల దాకా విరాళాలు వస్తున్నాయి. అయినా సౌకర్యాలు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెరిగిన వ్యాధి తీవ్రత..
దోమకాటుతో గోవులకు తీవ్ర మెదడువాపు వ్యాధి (థ్రిప్స్) సోకింది. ఉన్నపాటున గోవులు తీవ్ర జ్వరం, మెదడువాపుతో ఎక్కడ పడితే అక్కడ కూలిబడుతున్నాయి. వారం రోజుల్లో దాదాపు 10 గోవులు మృత్యువాత పడ్డాయి. మూడురోజులుగా వ్యాధి తీవ్రత అధికమైంది. దాదాపు 100 ఆవులకు పైగా వ్యాధితో బాధపడుతున్నాయి. గోశాల సూపర్‌వైజర్ వైద్యులకు చూపించామని చెబుతున్నా దోమల నిర్మూలన కష్టంగా మారింది.
ఖననంలో ఇష్టారాజ్యం :
మృత్యువాత పడిన గోవులను పూడ్చిపెట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. తుంగభద్ర నదీతీరంలో చనిపోయిన గోవులను గోతిలో పడేసి వస్తున్నారు. వాటి కళేబరాలను కుక్కులు పీక్కుతినడంతో నదీతీరంలో కలుషితమవుతోంది. గోశాల కెపాసిటీ 250 గోవులు మాత్రమే ఉండగా, సంఖ్య ఎక్కువగా ఉండడంతో సంరక్షణలో లోపాలు తలెత్తుతున్నాయి. గతంలో ఇదే విషయాన్ని పశువైద్యాధికారులు చెప్పినా ఇక్కడి అధికారులు పట్టించుకోవడం లేదు.
చికిత్స చేయిస్తున్నాం
దోమల బెడద కారణంగా గోవులు మృత్యువాత పడుతున్న విషయం వాస్తవమే. ప్రభుత్వ పశువైద్యులతో పరీక్షలు చేయించాం. థ్రిప్స్ వ్యాధితో గోవులు చనిపోతున్నాయని గుర్తించారు. ఎప్పటికప్పుడు చికిత్సలు చేసి మృత్యువాత పడకుండా చూస్తున్నాం. –శ్రీనివాస ఆచార్, సూపర్‌వైజర్
Advertisement