కలహాలు మానుకుందాం
టీడీపీ, బీజేపీ సమన్వయ కమిటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కలహాలు మానుకొని ఇకపై కలిసి పని చేయాలని తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రెండు పార్టీల నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించారు. కొద్ది రోజులుగా ఇరు పార్టీల నేతలు చేసుకుంటున్న పరస్పర విమర్శలకు స్వస్తి పలకాలని ప్రాథమికంగా నిర్ణయించారు. రెండు పార్టీల నేతలు శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీఎం చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు, రాష్ట్రమంత్రులు కామినేని శ్రీనివాస్,పైడికొండల మాణిక్యాలరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్యే కంతేటి సత్యనారాయణరాజు హాజర య్యారు.
సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో రెండు పార్టీల మధ్య తలెత్తే సమస్యలను నెలకోసారి సమావేశమై పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. తమ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీజేపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఇకపై ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో రెండు పార్టీల వారికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావడం లేదని టీడీపీ నేతలు విమర్శించారు. అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో సాయం చేస్తోందని, కనీసం ప్రధాని ఫొటోను కూడా ఏపీ ప్రభుత్వం ముద్రించడం లేదని బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనుంచి రెండు పార్టీల రాష్ట్ర కమిటీలు సమన్వయంతో మెలగాలని నిర్ణయించారు.