వెలగని దీపం !
– ఆర్థిక సంవత్సరం లక్ష్యం 98,542
– ఈ ¯ð లాఖరులోగా ఇవ్వాల్సింది 57,477
– మంజూరు చేసింది 32,933
అనంతపురం అర్బన్ : దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్నవారికి ‘దీపం’ అందడం లేదు. దీపం పథకాన్ని వారి దరి చేర్చడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడంలో ఆపసోపాలు పడుతున్నారు. పౌర సరఫరాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్షలు లక్ష్యం సాధించే దిశగా ఫలితాలను ఇవ్వడం లేదు. ఇందుకు అధికారిక లెక్కలే నిదర్శనం.
లక్ష్యం 98 వేలు ..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి జిల్లాలో దీపం పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు 98,542 కనెక‌్షన్లు మంజూరు లక్ష్యంగా ఉంది. ఈ (డిసెంబరు) నెలాఖరుకు 57,477 కనెక‌్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. అయితే ఇప్పటి వరకు 32,933 కనెక‌్షన్లను (57శాతం) మాత్రమే ఏజెన్సీలు ఇవ్వగలిగాయి. అంటే ఈ నెలాఖరుకు నిర్ధేశించిన లక్ష్యం మేరకు 14,544 బీపీఎల్ కుటుంబాలకు గ్యాస్ కనెక‌్షన్లు అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం మంజూరు చేసినవి పోనూ ఆర్థిక సంవత్సరం లక్ష్యం మేరకు 2017 మార్చి నాటికి ఇంకా 65,609 కనెక‌్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. తక్కిన మూడు నెలల్లో ఈ లక్ష్యం సాధించాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి నిర్ధేశించి లక్ష్యమే పూర్తి కాలేదు. దీన్ని బట్టి చూస్తే మార్చి నాటికి 65,609 కనెక్షన్లు మంజూరు ఏ మేరకు సాధిస్తారో అధికారులకే తెలియాలి.
ఫలితమివ్వని సమీక్షలు : దీపం పథకం కింద నిర్ధేశించిన లక్ష్యం సాధించాలంటూ సంబంధిత శాఖ అధికారులు, గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్షలు ఫలితమివ్వడం లేదని స్పష్టమవుతోంది. ప్రతి ఏజేన్సీకి నెలవారీ లక్ష్యం విధిస్తున్నా, ఆ మేరకు మంజూరు కావడం లేదని తెలిసింది. లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి ఏజెన్సీలకు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ సీఎస్‌డీటీలకు ఆదేశాలిస్తున్నారు. అయితే ఆచరణలో మాత్రం ఉన్నతాధికారులు ఆదేశాల అమలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.