చదువుల తల్లి శవమైపోయింది
► అనుమానాస్పదంగా డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
► కొల్లివలసలో విషాదఛాయలు
► అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా పోలీసుల రంగప్రవేశం
► శ్మశానంనుంచి ఆస్పత్రికి మృతదేహం తరలింపు
► పోస్టుమార్టం రిపోర్టు వచ్చేకే పూర్తి వివరాలు
అమ్మవారి పండగకు తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థిని.. తిరిగి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికీ ఇంట్లో దూలానికి ఉరివేసుకుని దర్శనమిచ్చింది. ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసలో సంచలనం రేపిన ఈ సంఘటనలో వివరాలను పోలీసులు సైతం గోప్యంగా ఉంచుతున్నారు.
ఆమదాలవలస: విశాఖపట్నం జిల్లా ఆమదాలవలస మండలంలోని గాజులకొల్లివలస గ్రామానికి చెందిన టీడ భాగ్యవతి(19) బుధవారం రాత్రి ఇంట్లో పెడక దూలానికి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ కూన గోవిందరావు తెలిపారు. భాగ్యవతి ప్రస్తుతం శ్రీకాకుళం మెన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆయన కథనం ప్రకారం.. భాగ్యవతి బుధవారం తన తల్లిదండ్రులు లక్ష్మీకాంతం, రామయ్యలతో కలిసి పట్టణంలోని వెంగళరావు కాలనీలో జరిగిన అమ్మవారి పండగలకు హాజరై తిరిగి రాత్రి ఇంటికి చేరుకుంది.
అప్పటివరకు అందరితో సరదాగా గడిపిన కుమార్తె, కొంత సేపటికి తమ ఇంట్లో వెనుకభాగంలో ఉన్న వంటగదిలో ఉరివేసుకుని వేలాడాన్ని గమించామని తల్లిదండ్రులు చెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు. తల్లిదండ్రులు కుమార్తె చావును గోప్యంగా ఉంచి గురువారం ఉదయాన్నే అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించారని, ఇంతలో ‘100’ నంబర్‌కు ఆ గ్రామం నుంచి ఓ వ్యక్తి సమాచారం అందించడంతో ఎస్‌ఐ సిబ్బందితో హుటాహుటిన గ్రామానికి వెళ్లారు. అప్పటికే శ్మశానానికి తరలించిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. యువతి మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పోస్టుమార్టం నివే దిక ప్రకారం కారణాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు.
డిగ్రీ పూర్తియిన తరువాత బ్యాంకు టెస్టుకు ప్రిపేరై బ్యాంకు జాబ్ పొందేందుకు నిరంతరం శ్రమిస్తానని చెప్పేదని, తెలివైన విద్యార్థిని ఇలా ఆత్మహత్యకు పాల్పడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులతో చెబుతున్నారు. భాగ్యవతి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.