అయ్యో.. అన్నమయ్య
♦ డ్యాం ఆధునికీకరణలో జాప్యం
♦ పర్యాటకపరంగా నోచుకోని అభివృద్ధి
♦ నరకప్రాయంగా ప్రాజెక్టు రోడ్డు
♦ డ్యాం నిర్వహణపై కలెక్టరు అసంతృప్తి
రాజంపేట: చెయ్యేరు నదిపై నిర్మితమైన అన్నమయ్య జలాశయం ఆధునికీకరణలో జాప్యం కొనసాగుతోంది. బడ్జెట్‌లో కూడా అరకొరగా నిధులు కేటాయించడంతో అభివృద్ధికి నోచుకోని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు నిధులు పుష్కలంగా ఉన్నాయని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ వెళ్లడించడంతో ఇక ఆధునికీకరణ పనులు చేపట్టడానికి కారణాలు ఏమిటో అంతుబట్టడం లేదు. గేట్లకు రబ్బరు సీలు, గ్రీసు, పెయింటింగ్ లేక జలాశయం బోసిపోయింది. పర్యాటకపరంగా అభివృద్ధికి నోచుకోలేదు.
2.33948 టీఎంసీ స్టోరేజీ కెపాసిటీతో నిర్మితమైన జలాశయ నిర్మాణానికి తొలుత అంటే 1996-97లో రూ.68.92కోట్ల వ్యయంతో ప్రారంభించారు. అప్పటి నుంచి దశలవారీగా నిర్మాణం పూర్తి చేసుకుంది. 2001-2002లో రూ.57.347కోట్లు వ్యయం చేశారు. 2003లో వరదలకు గేట్లు డ్యామేజీ కావడంతో రూ.1.20కోట్లు 2004 జూన్ నాటికి పూర్తి చేశారు. 2003-2004 లో రూ3.కోట్లు కేటాయించారు. ఆది నుంచి అన్నమయ్య డ్యాం అరకొర నిధులతోనే ముందుకు సాగుతూ వచ్చింది.
ప్రతిపాదన దశలో..
జలాశయం అభివృద్ధి చేయడానికి నిధులు కోసం ఎదురు చూపులతో కాలయాపన జరుగుతోంది. ఉన్న అరకొర నిధులకు సంబంధించి ప్రతిపాదన దశలో ఉందని సమాచారం. అంధకారంలో ఉన్న జలాశయానికి సోలార్ వెలుగులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి రూ.25లక్షలతో ఎస్టిమేట్స్ వెళ్లాయి. అలాగే పెయింటింగ్ కోసం రూ.1.60కోటి నిధుల విడుదలకు సంబంధించి ఎస్టిమేట్స్ ప్రభుత్వానికి పంపారు. పవర్‌లైను రిపేరు కోసం రూ.1.4లక్షలు, జనరేటర్‌కు రూ. 1.63లక్షలు, క్రైన్‌మెయింటెనెన్స్‌కు రూ.136లక్షలు, ఎర్త్ డ్యాం గ్యాలరీ కోసం రూ.2.1లక్షలు, స్పిల్‌వేకు రూ.2.8లక్షలు, రబ్బర్‌సీలింగ్ (గేట్ల) రూ.9.9లక్షలు, స్పాట్‌లాగ్ ఎలిమెంట్స్ రూ.9.9లక్షలు, ఆయిల్, గేట్ మెయింటెన్స్ కోసం రూ.8.42లక్షల కోసం ప్రతిపాదనలు పంపారు. టెండర్లను కూడా త్వరలో పిలవనున్నారు. సీఈ పరిధిలో జలాశయం మెయింటెన్స్‌కు ఈ పనులు చేట్టనున్నారు.
పర్యాటకపరంగా నోచుకోని అభివృద్ధి..
గత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో అన్నమయ్య డ్యాంను పర్యాటక పరంగా అభివృద్ది చేయాలని ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనలను తర్వాత వచ్చిన పాలకులు ఆటకెక్కించారు. అలాగే పర్యాటకులు ఉండటానికి అతిథి గృహం కూడా శిధిలావస్థకు చేరుకుంది. పర్యాటకులు పోవడానికి వీలులేని విధంగా డ్యాం రోడ్డు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా రోడ్డులో వెళ్లాలంటే వాహనదారులకు నరక ప్రాయం చూపిస్తోంది. ఈ డ్యాంను జిల్లా కలెక్టరు సందర్శించి డ్యాం నిర్వహణపై పెదవి విరిచారు. నిధులు ఉన్నా డ్యాం ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఏ అధికారి వచ్చినా డ్యాం గురించి నిర్వహణ లోపాలను ఎత్తిచూపడమే తప్ప మరొకటి ఉండదనే భావన పర్యాటకుల్లో నెలకొంది.