Cheyyeru River
-
వైఎస్సార్ జిల్లా: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
సాక్షి, వైఎస్సార్: భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఎడతెరపిలేని వర్షం కారణంగా పలు జిల్లాలోని నదులు పొంగి పోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజంపేట వద్ద ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సు మీదకు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగతున్నాయి. (చదవండి: వాయు గుండం ప్రభావం: భారీ నుంచి అతి భారీ వర్షాలు..) చెయ్యేరు నదిలో 15 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం పదిహేను మంది నదిలో గల్లంతయ్యారు. అలానే అనంతపురం చిత్రావతి నదిలో 10 మంది చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: వర్షాలపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష.. -
ఇసుకాసురులకు చేతినిండా పని
► చెయ్యేరులో క్వారీలకు రంగంసిద్ధం! రాజంపేట: చెయ్యేరు నది ఇసుకకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ లభించే ఇసుక నాణ్యమైనది కావడంతో జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి ఇసుక వైపు మొగ్గు చూపుతారు. చెయ్యేరు నదిపై అన్నమయ్య జలాశయం నిర్మించడం వల్ల ఎడారిగా మారిపోయింది. 2015లో వచ్చిన వరదలకు డ్యాం నుంచి లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగింది. ఫలితంగా ఇసుక మేటలు భారీగా వేశాయి. ప్రస్తుతం ఎడారిగా మారిపోవడంతో ఇసుకాసురులకు కలిసివచ్చింది. నది తీరం వెంబడి ఎక్కడపడితే అక్కడ తోడేస్తున్నారు.ఇప్పటికే ఎంజీపురం నుంచి అధికారికంగా క్వారీలకు అనుమతి ఇచ్చారు. ఇక్కడి నుంచి ఇసుక రవాణా ఉచితంగా చేసుకోవచ్చునని టీడీపీ సర్కారు ఆదేశించింది. ఈ క్వారీలను అడ్డం పెట్టుకొని అధికార పార్టీకి చెందిన నాయకులు అక్కడా..ఇక్కడా అని లేకుండా ఇసుకను భారీగా తరలించేస్తున్నారు. ఇష్టానుసారంగా ఇసుకను తోడేయడంతో భూగర్భజలాలు అడుగుంటిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటి పథకాలకు ముప్పు వాటిల్లకుండా ఇసుకరీచ్‌లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సర్వే నిర్వహించారు. చెయ్యేరు నదిపరీవాహక ప్రాంతంలో మూడు రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాజంపేట మండలంలోని బాలరాచపల్లె, నందలూరు మండలంలోని టంగుటూరు, పెనగలూరు మండలంలోని కోమంతరాజుపురంలో వీటిని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుందా లేదా అనే కోణంలో అధికారబృందాలు పరిశీలించి వెళ్లాయి. ఈ రీచ్‌లకు జిల్లా కలెక్టరు నుంచి ప్రొసీడింగ్స్ రావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల నుంచి అనధికారికంగా ఇసుకను అడపదడపా తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎదీ ఎమైనప్పటికి చెయ్యేరులో మరో మూడురీచ్లు వస్తే ఇసుకాసురులకు చేతినిండా పనే అని పలువురు అంటున్నారు. -
అయ్యో.. అన్నమయ్య
♦ డ్యాం ఆధునికీకరణలో జాప్యం ♦ పర్యాటకపరంగా నోచుకోని అభివృద్ధి ♦ నరకప్రాయంగా ప్రాజెక్టు రోడ్డు ♦ డ్యాం నిర్వహణపై కలెక్టరు అసంతృప్తి రాజంపేట: చెయ్యేరు నదిపై నిర్మితమైన అన్నమయ్య జలాశయం ఆధునికీకరణలో జాప్యం కొనసాగుతోంది. బడ్జెట్లో కూడా అరకొరగా నిధులు కేటాయించడంతో అభివృద్ధికి నోచుకోని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు నిధులు పుష్కలంగా ఉన్నాయని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ వెళ్లడించడంతో ఇక ఆధునికీకరణ పనులు చేపట్టడానికి కారణాలు ఏమిటో అంతుబట్టడం లేదు. గేట్లకు రబ్బరు సీలు, గ్రీసు, పెయింటింగ్ లేక జలాశయం బోసిపోయింది. పర్యాటకపరంగా అభివృద్ధికి నోచుకోలేదు. 2.33948 టీఎంసీ స్టోరేజీ కెపాసిటీతో నిర్మితమైన జలాశయ నిర్మాణానికి తొలుత అంటే 1996-97లో రూ.68.92కోట్ల వ్యయంతో ప్రారంభించారు. అప్పటి నుంచి దశలవారీగా నిర్మాణం పూర్తి చేసుకుంది. 2001-2002లో రూ.57.347కోట్లు వ్యయం చేశారు. 2003లో వరదలకు గేట్లు డ్యామేజీ కావడంతో రూ.1.20కోట్లు 2004 జూన్ నాటికి పూర్తి చేశారు. 2003-2004 లో రూ3.కోట్లు కేటాయించారు. ఆది నుంచి అన్నమయ్య డ్యాం అరకొర నిధులతోనే ముందుకు సాగుతూ వచ్చింది. ప్రతిపాదన దశలో.. జలాశయం అభివృద్ధి చేయడానికి నిధులు కోసం ఎదురు చూపులతో కాలయాపన జరుగుతోంది. ఉన్న అరకొర నిధులకు సంబంధించి ప్రతిపాదన దశలో ఉందని సమాచారం. అంధకారంలో ఉన్న జలాశయానికి సోలార్ వెలుగులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి రూ.25లక్షలతో ఎస్టిమేట్స్ వెళ్లాయి. అలాగే పెయింటింగ్ కోసం రూ.1.60కోటి నిధుల విడుదలకు సంబంధించి ఎస్టిమేట్స్ ప్రభుత్వానికి పంపారు. పవర్లైను రిపేరు కోసం రూ.1.4లక్షలు, జనరేటర్‌కు రూ. 1.63లక్షలు, క్రైన్మెయింటెనెన్స్కు రూ.136లక్షలు, ఎర్త్ డ్యాం గ్యాలరీ కోసం రూ.2.1లక్షలు, స్పిల్‌వేకు రూ.2.8లక్షలు, రబ్బర్సీలింగ్ (గేట్ల) రూ.9.9లక్షలు, స్పాట్లాగ్ ఎలిమెంట్స్ రూ.9.9లక్షలు, ఆయిల్, గేట్ మెయింటెన్స్ కోసం రూ.8.42లక్షల కోసం ప్రతిపాదనలు పంపారు. టెండర్లను కూడా త్వరలో పిలవనున్నారు. సీఈ పరిధిలో జలాశయం మెయింటెన్స్‌కు ఈ పనులు చేట్టనున్నారు. పర్యాటకపరంగా నోచుకోని అభివృద్ధి.. గత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో అన్నమయ్య డ్యాంను పర్యాటక పరంగా అభివృద్ది చేయాలని ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనలను తర్వాత వచ్చిన పాలకులు ఆటకెక్కించారు. అలాగే పర్యాటకులు ఉండటానికి అతిథి గృహం కూడా శిధిలావస్థకు చేరుకుంది. పర్యాటకులు పోవడానికి వీలులేని విధంగా డ్యాం రోడ్డు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా రోడ్డులో వెళ్లాలంటే వాహనదారులకు నరక ప్రాయం చూపిస్తోంది. ఈ డ్యాంను జిల్లా కలెక్టరు సందర్శించి డ్యాం నిర్వహణపై పెదవి విరిచారు. నిధులు ఉన్నా డ్యాం ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఏ అధికారి వచ్చినా డ్యాం గురించి నిర్వహణ లోపాలను ఎత్తిచూపడమే తప్ప మరొకటి ఉండదనే భావన పర్యాటకుల్లో నెలకొంది. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
రాజంపేట (వైఎస్సార్‌జిల్లా): గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు గ్రామ సమీపంలోని చెయ్యేరు నదిలో ఆదివారం లభ్యమైంది. నదిలో వ్యక్తి (35) మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతుడు రెండు మూడు రోజులుగా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ కనిపించాడని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.