ఏజెన్సీలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
Published Tue, Mar 21 2017 1:35 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులను స్థానికంగా అర్హులైన గిరిజనులతోనే భర్తీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు. సోమవారం బాలరాజు ఆధ్వర్యంలో గిరిజన ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, కళావతి, గిద్దా ఈశ్వరి, ఏపీ ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు, ఆ సంఘ ప్రధాన కార్యదర్శి కణితి శేఖర్, ప్రతినిధులు సరియం నాగేశ్వరావుతో కూడిన బృందం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సెక్రటరీ ఆదిత్యనా«థ్ దాస్‌ను కలిసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివాసీ గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాలను భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా గుర్తించి ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటించిందన్నారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఏజెన్సీ ప్రాంతం, మైదాన ప్రాంతం వారికి వేర్వేరుగా చేపట్టనున్నట్టు చెప్పారు. జీవో నెంబర్ 5,2 ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్‌లో భాగంగా రిక్రూట్‌మెంట్‌తో పాటు ప్రమోషన్‌లో నియామక రోస్టర్ పాయింట్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్‌లు వర్తింపజేయాలన్నారు. ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేసినప్పుడు ప్రమోషన్‌లు కూడా వారితోనే పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆదిత్యనాథ్ తెలిపినట్టు ఉపాధ్యాయ సంఘం నాయకులు జలగం రాంబాబు పేర్కొన్నారు.
Advertisement