ఫీజుపై పోరుబాట
బకాయిలు తక్షణమే విడుదల చేయాలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ డిమాండ్
► లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
► మిషన్ భగీరథ, కాకతీయ పనులకు కోట్లు పెడుతున్నారు
► బడుగుల పిల్లల చదువులకు పైసలిచ్చేందుకు చేతులు రావా?
► లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమైందని నిలదీత
► ‘ఫీజు పోరు’కు కదలివచ్చిన నేతలు, పార్టీ శ్రేణులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతామని ప్రకటించింది. సంక్షేమ పథకాలు ,ఇతరత్రా అంశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి పార్టీ నడుం బిగిస్తుందని హెచ్చరించింది. మంగళవారమిక్కడ ఇందిరాపార్కు వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫీజు పోరు’ ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు.
‘‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితరాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు అంచనాలు వేశారు. కానీ బడుగుల పిల్లల చదువుల కోసం ఫీజుల బకాయిలు రూ.3,600 కోట్లు చెల్లించేందుకు కేసీఆర్‌కు చేతులు రావడం లేదు. పదేళ్ల చంద్రబాబు దుష్ట పరిపాలనకు వైఎస్ చరమగీతం పాడి.. రైతన్నలు ఆత్మహత్యల బారిన పడకుండా ఉచిత విద్యుత్ సరఫరా చేశారు. బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథ«కం తెచ్చారు. ఈ పథకాన్ని కొనసాగించాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉంది. ఫీజు బకాయిల చెల్లింపును నిర్లక్ష్యం చేస్తే.. దాంతోపాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో పార్టీ యంత్రాంగాన్ని కదిలించి పోరాటానికి సన్నద్ధమవుతాం’’ అని ఆయన ప్రకటించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దాదాపు మూడేళ్ల సమయం ఇచ్చామని, ఇక ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తామన్నారు. లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమైందని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేలను చేర్చుకుని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసినట్లు స్పీకర్ ప్రకటించారని, ఇప్పుడు ఈ ధర్నాను చూసైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీఆర్‌ఎస్‌కు కనువిప్పు కావాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్రను నిర్వహించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.
టీఆర్‌ఎస్ ఖబడ్దార్..
ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పనైపోయిందని టీఆర్‌ఎస్ భావిస్తే ఖబడ్దార్ అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మొత్తం ఏప్రిల్ 30వ తేదీలోగా పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరేలా వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడుతుందని పార్టీ ›ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ చెప్పారు. టీఆర్‌ఎస్‌వి ఆకర్షణీయమైన ప్రకటనలు తప్ప వాటి ఆచరణ మాత్రం లేదని పార్టీ సీఈసీ సభ్యుడు రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు.
మైనారిటీలు ఉన్నత చదవులు అభ్యసించరాదనే కుట్రతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి మతీన్ విమర్శించారు. తక్షణమే ఫీజులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని పార్టీ ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోయనపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్, వెల్లాల రామ్మోహన్, విశ్వనాథాచారి, అమృత సాగర్, ప్రఫుల్లారెడ్డి, బండారు వెంకట రమణ, ఎన్.భిక్షపతి, శ్రీవర్ధన్‌రెడ్డి, పాలెం రఘునాథరెడ్డి, జిల్లాల అధ్యక్షులు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి(రంగారెడ్డి), బెంబడి శ్రీనివాస్‌రెడ్డి(మేడ్చల్), అనిల్ కుమార్ (ఆదిలాబాద్), లక్కినేని సుధీర్‌బాబు (ఖమ్మం), మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి(నాగర్ కర్నూలు), అచ్చిరెడ్డి(మహబూబాబాద్), సంగల ఇర్మియా (వరంగల్–అర్బన్), జగదీశ్ గుప్తా (సిద్దిపేట), విష్ణువర్ధన్‌రెడ్డి(వనపర్తి), గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి(సంగారెడ్డి), బీస మరియమ్మ (మహబూబ్‌నగర్), వడ్నాల సతీశ్ (మంచిర్యాల), జమ్లాపూర్ సుధాకర్ (ఆసిఫాబాద్), నీలం రమేశ్(నిజామాబాద్), నగేశ్ (కరీంనగర్), ఏనుగు రాజీవ్‌రెడ్డి (జగిత్యాల), సెగ్గం రాజేశ్(పెద్దపల్లి), సీహెచ్ రాము(సిరిసిల్ల) పాల్గొన్నారు.
ఫీజు పోరుకు కృష్ణయ్య సంఘీభావం
సాక్షి, హైదరాబాద్: బీసీ విద్యార్థులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఎనలేని సాయం చేశారని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. మంగళవారం ఇందిరా పార్కు వద్ద వైఎస్సార్ సీపీ చేపట్టిన ఫీజు పోరు మహాధర్నా శిబిరాన్ని సందర్శించి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. తాను వైఎస్సార్‌ను కలసి బీసీ విద్యార్థులకు కూడా న్యాయం చేయాలని కోరిన మరుక్షణమే 2008–09 విద్యా సంవత్సరంలో బీసీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేశారని, ఆయన రుణం తీర్చుకోలేనిదని అన్నారు. అనంతరం వేదికపై నుంచి ఒక్కసారిగా జోహార్ వైఎస్సార్...జోహార్ వైఎస్సార్ అంటూ ఆర్.కృష్ణయ్య నినదించారు.