కోర్టు స్టే ఇచ్చినా.. కూల్చేస్తున్నారు
కోర్టు స్టే ఇచ్చినా.. కూల్చేస్తున్నారు
Published Sun, Jul 31 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
విజయవాడ (వన్‌టౌన్ ) :
నెహ్రూ రోడ్డు విస్తరణ పనులను నగరపాలకసంస్థ అధికారులు శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభించారు. రెండు నెలల క్రితం నెహ్రూరోడ్డు విస్తరణకు అధికారులు సిద్ధం కాగా, స్థానికులు అడ్డుకున్నారు. వారితో అధికారుల చర్చలు విఫలం కావటంతో కొద్ది రోజులుగా విస్తరణ పనులు నిలిచిపోయాయి. దీనిపై భవన యజమానులకు సమస్యను పరిష్కరిస్తానంటూ చెబుతూ వచ్చిన స్థానిక శాసనసభ్యుడు జలీల్‌ఖాన్ ఇప్పుడు చేతులు ఎత్తేశారు. దాంతో అధికారులు శనివారం అర్ధరాత్రి పలు జేసీబీలతో అక్కడకు చేరుకొని ఆయా భవనాల షట్టర్లను కూలగొట్టారు. గాంధీహిల్ నుంచి పెట్రోల్‌బంక్ వరకూ ఉన్న దుకాణాలన్నింటిని తలుపులే లేకుండా గోడలను కూలగొట్టారు. సరుకును సర్ధుకోవటానికి కూడా ఎవరికీ సమయం ఇవ్వలేదు. దాంతో సరుకులు పాడై తీవ్రంగా నష్టపోయామంటూ స్థానిక యజమానులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు ఆదేశాలూ బేఖాతరు
విస్తరణ ను వ్యతిరేకిస్తూ పలువురు భవన యజమానులు న్యాయస్థానాలను ఆ«శ్రయించి స్టేఆర్డర్‌ను తీసుకొచ్చారు. వాటిని చూపించినా అధికారులు తమకు సంబంధం లేదంటూ కూల్చివేయడం గమనార్హం. పలువురు భవనాల తలుపులకు న్యాయస్థానాల తీర్పుల కాపీలను అంటించినా అధికారులు పట్టించుకోకుండా కూల్చివేతలను కొనసాగించారు.
కార్మికునికి తీవ్ర గాయాలు
తారాపేట పెట్రోల్‌బంక్ ఎదురుగా ఉన్న భవనం ఎదుట తలుపులను జేసీబీతో అధికారులు తొలగిస్తుండగా ఆ ఇనుప తలుపులు పడి అక్కడ పనిచేస్తున్న కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒక ప్రైవేటు ఆస్పత్రి ఐసీయులో ఉంచి చికిత్స చేస్తున్నారు.
Advertisement
Advertisement