గార్లదిన్నె : మండలంలోని ఇల్లూరుకు చెందిన మస్తానయ్య కూతురు లక్ష్మీనరసమ్మ(తొమ్మిదో తరగతి విద్యార్థిని) డెంగీ లక్షణాలతో బాధపడుతోందని స్థానికులు తెలిపారు. పది రోజుల కిందట బాలికకు జ్వరం సోకగా, అనంతపురంలోని పెద్దాస్పత్రిలో చికిత్స చేయించారు. అక్కడ పరీక్షించి వైద్యులు డెంగీ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారని వివరించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. కాగా జిల్లా అదనపు వైద్యాధికారిణి డాక్టర్ పద్మావతి, మలేరియా జిల్లా అధికారి డాక్టర్ దోసారెడ్డి తమ సిబ్బందితో కలసి ఇల్లూరులో గురువారం పర్యటించారు. మస్తానయ్య ఇంటిని పరిశీలించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సూపర్‌వైజర్ నాగేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ శివయ్య పాల్గొన్నారు.