dengue virus
-
ప్లేట్లెట్లు తగ్గేది ఇందుకే..
సాక్షి, హైదరాబాద్: డెంగీ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిపోయేందుకు కారణమేమిటో గుర్తించామని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ విభాగం శాస్త్రవేత్తలు సోమవారం ప్రకటించారు. వ్యాధికారక వైరస్‌లోని ప్రొటీన్ ఒకటి కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును ప్రభావితం చేస్తుండటం వల్ల ప్లేట్లెట్లు తగ్గిపోతున్నట్లు తాము ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నామని డాక్టర్ ఎం. వెంకట రమణ, డాక్టర్ ఎస్. నరేశ్‌బాబులు తెలిపారు. సుమారు 140 దేశాల్లో ప్రభావం చూపగల డెంగీకి ఇప్పటివరకూ సరైన టీకా లేదా మందు లేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము డెంగీ కారక వైరస్‌పై పరిశోధనలు చేపట్టామని తెలిపారు. డెంగీ వైరస్‌లో మొత్తం పది వరకూ ప్రొటీన్లు ఉంటే ఇందులోని ఎన్ఎస్–3 ప్రొటీన్ నకళ్ల తయారీలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఎన్ఎస్–3 ప్రొటీన్ కణానికి శక్తిని అందించే మైటోకాండ్రియా మ్యాట్రిక్స్‌లోకి ప్రవేశించి జీఆర్పీఈఎల్1 అనే ప్రొటీన్‌ను ముక్కలు చేస్తోందని, ఇది కాస్తా మైటోకాండ్రియా పనితీరుపై ప్రభావం చూపుతున్నట్లు తాము గుర్తించామని వారు వివరించారు. ఈ కారణంగానే రక్తంలోని ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయన్నది తమ అంచనాగా వారు చెప్పారు. జీఆర్పీఈఎల్1 ప్రొటీన్ ఆధారంగా డెంగీకి సమర్థమైన మందులు తయారు చేసేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని అన్నారు. మానవ, జంతు సంబంధిత వైరస్ మైటోకాండ్రియాలోని ప్రొటీన్లతో చర్య జరుపుతున్నట్లు తెలియడం ఇదే మొదటిసారి అని, కరోనా కారక వైరస్‌లోనూ ఇదేమాదిరిగా జరుగుతుండవచ్చని తెలిపారు. పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ వైరాలజీ సంచికలో ప్రచురితమయ్యాయి. -
కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరస్!
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా వందేళ్ల క్రితం అంటే, 1919లో ‘స్పానిష్ ఫ్లూ’ మూడొంతుల ప్రపంచాన్ని చుట్టుముట్టడంతో దాదాపు ఐదు కోట్ల మంది మరణించారు. అలాంటి వైరస్ ఇప్పుడు ప్రపంచానికి సోకితే కనీసం ఎనిమది కోట్ల మంది ప్రజలు మరణిస్తారు. ఒకప్పుడు మెల్లగా విస్తరించిన ఈ ఫ్లూ, ఓ దేశానికి చెందిన ప్రజలు, మరో దేశానికి నిరంతరంగా ప్రయాణిస్తున్న నేటి వేగవంతమైన యుగంలో కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. అదే గనుక జరిగితే అపార జన నష్టంతోపాటు దేశ దేశాల జాతీయ భద్రత అస్తవ్యస్తం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ నాయకత్వంలోని ‘గ్లోబల్ ప్రిపేర్డ్నెస్ మానిటరింగ్ బోర్డ్’ సభ్యుల బందం ఈ హెచ్చరికలను చేసింది. ఈ మేరకు ‘ఏ వరల్డ్ ఎట్ రిస్క్’ శీర్షికతో రూపొందించిన ఓ నివేదికను బుధవారం అమెరికాలో విడుదల చేసింది. ‘ఎబోలా’ లాంటి వైరస్లు వేగంగా సోకుతున్న నేటి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఫ్లూలు ప్రపంచానికి సోకే ప్రమాదం ఉందని, అలాంటి వైరస్‌లను ఇప్పటి నుంచి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ డైరెక్టర్ –జనరల్, నార్వే మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ గో ఆర్లెం బ్రుండట్లాండ్ నాయకత్వంలోని జీపీఎంబీ బృందం హెచ్చరికలను జారీ చేస్తోంది. ఏ వైరస్ ఏ ప్రాంతాన్నీ, ఏ దేశాన్ని సోకే అవకాశం ఉందో కూడా ప్రపంచ పటంపై మార్కు చేసి చూపించింది. 1918లో స్పానిష్ ఫ్లూ అమెరికాలో విస్తరించినప్పుడు చికిత్స కేంద్రాల్లో పనిచేస్తున్న రెడ్‌క్రాస్ కార్యకర్తలు అంటే నిఫా వైరస్ ఏ దేశాన్ని చుట్టు ముడుతుందో, కలరా ఏ దేశాన్ని చికెన్ గున్యా, డెంగ్యూలాంటి వైరస్లు ఏయే దేశాలు చుట్టుముడుతాయో మ్యాప్‌లో సూచించింది. వాటికి సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఏమిటో కూడా సూచించింది. ఇంతకుముందు విడుదలు చేసిన తమ నివేదికను దేశాధినేతలు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అరకొరగానే అమలు చేసినందువల్లనే ఈ రోజు మళ్లీ ఒక నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని బోర్డు వివరించింది. ఎబోలా, జికా, నిపా వైరస్‌లతోపాటు వెస్ట్ నైల్ వైరస్, డెంగ్యూ, ప్లేగ్, హ్యూమన్ మంకీపాక్స్‌ల గురించి హెచ్చరికలు చేసింది. -
డెంగ్యూ దోమపై విజయం
లండన్: పరిశోధకులు చేపట్టిన ఓ ప్రయోగం వల్ల డెంగ్యూ రహిత పట్టణం ఆవిర్భవించింది. నాలుగేళ్ల క్రితం డెంగ్యూ వైరస్‌ను అదుపు చేసేందుకు దోమల్లో ప్రవేశ పెట్టిన వోల్బచియా బ్యాక్టీరియా ప్రయోగం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ దీవిలో 66 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న టౌన్స్‌విల్లే వేదికైంది. ఆస్ట్రేలియా పరిశోధకులు దోమల్లో వోల్బచియా బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి ఇతర దోమలతో జత కూడేలా చేయడంతో డెంగ్యూ వైరస్‌ను నివారించగలిగారు. 2014 నుంచి టౌన్స్‌విల్లేలో ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాలేదు. ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న డెంగ్యూ, జికా వ్యాధులను అదుపు చేయాలనే లక్ష్యంతో ఈ పరిశోధన మొదలు పెట్టామని, ఈ ఫలితాలతో తమకు నమ్మకం పెరిగిందని వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ డైరెక్టర్ స్కాట్ ఓ నీల్ చెప్పారు. ప్రస్తుతం వీటిని ఇండోనేషియాలో ప్రయోగిస్తున్నారు. జికా వైరస్‌ను నివారించేందుకు వీటిని బ్రెజిల్ రాజధాని రియో డీ జెనీరోలో ప్రయోగించనున్నారు. ‘టౌన్స్‌విల్లే కన్నా రెట్టింపు విస్తీర్ణం, 15 లక్షల జనాభా ఎక్కువగా ఉన్న రియోలో ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలో ఎక్కడైనా మేం విజయం సాధిస్తాం’ అని నీల్ అన్నారు. ఈ బ్యాక్టీరియా మలేరియాను నివారించగలదా అన్న కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. -
యూ అండ్ డెంగ్యూ
దోమ లేని ప్రదేశం లేదు! దోమ రాలేని ప్రదేశం లేదు! మరి జాగ్రత్త ఎలా? దోమను దరి చేరనివ్వకపోవడమే! చేరినా.. ధైర్యాన్ని జారన్వికపోవడమే! డెంగ్యూను ఎదుర్కోవాలంటే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది. ఇది ఏడిస్ ఈజిపై్ట అనే దోమ వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీని వేళ్ల కణుపుల దగ్గర తెల్లటి పులి చారల్లాంటి మచ్చలు ఉంటాయి కాబట్టి దీన్ని టైగర్ మస్కిటో అని కూడా అంటారు. చాలా మందకొడిగా ఉండే ఈ దోమ సాధారణంగా పగటి వేళల్లో కుడుతుంటుంది. పెద్దగా దూరాలూ ఎగరలేదు. అయిత కుట్టినప్పుడు డెంగ్యూ వచ్చేలా చేస్తుంది కాబట్టి దీన్ని ప్రమాదకరంగా పరిగణించాలి. సాధారణంగా డెంగ్యూ దానంతట అదే తగ్గిపోతుంది. అంటే ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అన్నమాట. ఆరోగ్యవంతుడైన వ్యక్తి శరీరంలోకి వైరస్ ప్రవేశించిన ప్రవేశించిన 4 నుంచి 7 రోజుల్లోపు ఆ వ్యక్తికి డెంగ్యూ లక్షణాలు బయటపడతాయి. చాలా వైరస్‌లలాగే డెంగ్యూ తనంతట తానే తగ్గిపోతుంది. అయితే ఈలోపు కొందరిలో ప్లేట్లెట్లు ఉండాల్సిన సంఖ్య కంటే తగ్గితే అది అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. అది చాలా ప్రమాదం. డెంగ్యూలో రకాలు : 1. అన్ డిఫరెన్షియేటెడ్ ఫీవర్ లేదా క్లాసికల్ డెంగ్యూ ఫీవర్– ఇది ఇతర ఫీవర్స్లాగానే అనిపించే జ్వరంలా అనిపించడంతో అన్–డిఫరెన్షియేటెడ్ ఫీవర్ అని అంటారు. ఇక డెంగ్యూ సోకినప్పుడు ఇతర వైరల్ ఫీవర్లలాగే ఇందులోనూ జ్వరం వస్తుంది కాబట్టి డెంగ్యూ సోకినప్పుడు వచ్చే జ్వరాన్ని క్లాసికల్ డెంగ్యూ ఫీవర్ అంటారు. 2. డెంగ్యూ హెమరెజిక్ ఫీవర్ – అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కావడం. 3. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ – అవయవాల్లో అంతర్గత రక్తస్రావంతో పాటు... బీపీ పడిపోయి షాక్‌లోకి వెళ్లడం. డెంగ్యూలోని సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి (ముఖ్యంగా నుదురు ప్రాంతంలో), కళ్ల వెనక నొప్పి, ఒళ్లు నొప్పులు, రాష్, ఒంటిపై ఎర్రని మచ్చలు రావడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోవడం మలేరియాలో అయితే నిర్ణీత సమయానికి ప్రతిరోజూ వస్తూ ఉంటుంది. కానీ డెంగ్యూ సోకిన వ్యక్తిలో జ్వరం ఎప్పుడైనా రావచ్చు. డెంగ్యూ వచ్చిన వారిలో వచ్చే నొప్పి ఎముకల విరిగినంత తీవ్రంగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్ : రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోతున్న కొద్దీ అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగేందుకు అవకాశాలు. ఒకవేళ అంతర్గత అవయవాల్లో రక్తస్రావం అయితే అదిచాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ అంతర్గత రక్తస్రావం లక్షణాలు ముందుగా కనుగొనడానికి టోర్నికేట్ అనే పరీక్షను నిర్వహించవచ్చు. చర్మం పై ఎర్రని మచ్చలు కనబడుతున్నా, కళ్లలో,నోటిలో మచ్చలు వచ్చినా, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా, ఇంజెక్షన్ ఇచ్చినచోట లేదా ఇతర ప్రదేశాల నుంచి రక్తస్రావం జరుగుతున్నా, వాంతుల్లో రక్తం ఉన్నా లేదా విరేచనం నల్లగావస్తున్నా (రక్తం కడుపులో ఉన్న యాసిడ్‌తో కలిసినప్పుడు నల్లగా మారుతుంది) డెంగ్యూ హెమరేజిక్ జ్వరంగా అనుమానించాలి. అయితే కొందరు ఒంట్లో ఐరన్ తక్కువగా ఉండటం వల్లఐరన్ టాబ్లెట్లు వాడుతుంటారు. వాళ్లకు కూడా మలం నల్లగానే వస్తుంది. ఇలా ఐరన్ టాబ్లెట్లు వాడే వారు ఈ లక్షణాలన్ని తెలుసుకొని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ టాబ్లెట్లువాడని వారిలో మలం నల్లగా వస్తుంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ : డెంగ్యూ సోకినప్పుడు జరిగే అంతర్గత రక్తస్రావం వల్ల కాళ్లు, చేతులు, ముఖంలో వాపు కనిపించవచ్చు. కొందరిలో పొట్టలో, ఊపిరితిత్తుల బయట, గుండె చుట్టూనీరు చేసి ఆయాసం పెరగవచ్చు. సాధారణంగా రెండు నుంచి ఏడు రోజుల జ్వరం వచ్చి తగ్గిన తరువాత ప్లేట్లెట్స్ పడిపోవడం, ఫలితంగా అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరగడంతోపాటు బీపీ తగ్గిపోయి మూత్రం సరిగా రాకపోవడం, షాక్ లాంటి చాలా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ వచ్చిన వారు జ్వరం తగ్గిపోయాక... అది తగ్గిపోయింది కదా ఇంకేంప్రమాదం ఉండదనే అపోహతో నిర్లక్ష్యం చేయకూడదు. వచ్చింది డెంగ్యూ అని తెలిశాక... ఆ తర్వాత కూడా కొంతకాలం డాక్టర్ ఫాలో అప్‌లో ఉండటం మంచిది. నిర్ధారణ పరీక్షలు : సీబీపీ పరీక్ష చేయాలి. ∙ డెంగ్యూ ఎన్ఎస్1 యాంటీజెన్ పరీక్ష అవసరం. ∙డెంగ్యూ ఐజీఎమ్ అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే వ్యాధి నిర్ధారణ రిపోర్టులు వచ్చేందుకు పట్టే సమయంఎక్కువ కాబట్టి అప్పటి వరకు ఆగకుండా... లక్షణాలను బట్టి ముందుగానే చికిత్స తీసుకోవడం మంచిది. పైగా దీనికి చేసే చికిత్స కూడా లక్షణాలను బట్టి చేసేదే. నిర్ణీతమైన చికిత్స లేదు.కాబట్టి లక్షణాలు కనిపించగానే చికిత్స మొదలుపెట్టడం మంచిది. ఇప్పుడు అందుబాటులో మరింత అధునాతనమైన నిర్ధారణ పరీక్ష : ఇప్పుడు ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనే అత్యాధునిక పరీక్ష అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది పెద్ద పెద్ద ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉంది. ప్లేట్లెట్లనుఎక్కించడానికి సంబంధించి, డెంగ్యూ పేషెంట్లకు ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో ప్లేట్లెట్లకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలతో పాటు శరీరంలో ప్లేట్లెట్ల ఉత్పాదనకలిగిన బోన్‌మ్యారో పనితీరు కూడా ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ప్లేట్లెట్లు వృద్ధి చెందుతాయా, లేదా, ఒకవేళ ప్లేట్లెట్లు ఎక్కించడం ఎంతమేరకు అవసరం... లాంటిచికిత్సకు ఉపకరించే ఎన్నో విషయాలు ఈ పరీక్ష ద్వారా వైద్యులు నిర్ధారణ చేస్తారు. అందుకు తగ్గట్లుగా ప్లేట్లెట్స్ మార్పిడి, చికిత్స విధానాన్ని అవలంబిస్తారు. ఒకవేళ బోన్మ్యారోలోలోపం ఉంటే పైపై చికిత్సలను ఆపేసి, ప్రధానమైన మూలాల్లోకి వెళ్లి మెరుగైన చికిత్సను సకాలంలో అందించి, పేషెంట్ ప్రాణాలను కాపాడతారు. డెంగ్యూకు గురైన ప్రతి పేషెంట్‌కీ ప్లేట్లెట్లమార్పిడి అవసరం ఉండదు. డెంగ్యూ వచ్చినవారు ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ ఉన్నప్పుడు పెద్దలైతే రోజూ 3 – 4 లీటర్ల వరకు, పిల్లలైతే రోజూ 2 లీటర్ల వరకు ద్రవాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. డెంగ్యూలో కనిపించే ఇతర లక్షణాలు సివియర్ డీహైడ్రేషన్, నిరంతరంగా బ్లీడింగ్ అవడం, ప్లేట్ లెట్స్ తక్కువవుతుంటాయి. దాంతో రక్తం గడ్డకట్టదు. రక్తపోటు పడిపోతుంది. లివర్ ఎన్లార్జ్ అయి డ్యామేజ్ అయ్యే ప్రమాదమూఉంటుంది. హార్ట్‌బీట్ నిమిషానికి 60 కంటే తక్కువకు కూడా పడిపోవచ్చు. బ్లీడింగ్, ఫిట్స్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమే డ్యామేజ్ అవుతుంది.హార్ట్‌బీట్ 60 కంటే తక్కువగా పడిపోవడం అన్నది ప్రమాదకరమైన సూచన. ఇలాంటి పరిస్థితి వస్తే ఇంటెన్సిక్ కేర్‌లో ఉంచాల్సిన అవసరం పడవచ్చు. డెంగ్యూ కనిపించగానే యాంటీబయాటిక్స్ ఇవ్వడం సరికాదు... చాలా మంది డాక్టర్లు డెంగీ లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్ మందులు ఉపయోగిస్తుంటారు. అయితే డెంగీ రోగికి జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్స్‌వాడటం సరికాదు. ఇలా మందుల వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గి్గతే అది అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు. ఫలితంగా మందులే ప్రమాదకరం కావచ్చు. డాక్టర్లు బాగా ఆలోచించాకే ఇతర మందులు కూడా... మనం వాడే చాలారకాల ఇతర మందులు సైతం ప్లేట్లెట్ కౌంట్‌ను తగ్గించే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ర్యానిటడిన్, సెఫలోస్పోరిన్, క్యాప్టప్రిల్, ఏసీ ఇన్హిబిటార్స్, బ్రూఫెన్,డైక్లోఫినాక్, యాస్పిరిన్ వంటి అనేక మందులు ప్లేట్లెట్ కౌంట్‌ను తగ్గించడం లేదా ప్లేట్లెట్ ఫంక్షన్‌ను ప్రభావితం చేస్తాయి. అందుకే రోగి పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతమరీ అవసరం అయితేనే యాంటి బయాటిక్స్‌తోపాటు ఏ ఇతర మందులనైనా ఇవ్వాలి. నివారణ ఎంతో మేలు... ఏ వ్యాధి విషయంలోనైనా చికిత్స కంటే నివారణ మేలు. ఇది నిల్వ నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియ పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరునిల్వ అనేదే జరగకుండా ఒకరోజు నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటించాలి.ఇంట్లోని మూలల్లో, చీకటి ప్రదేశంల్లో ఎడిస్ ఎజిపై్ట విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి పర్చుకునేలా చూసుకోవాలి. అదే సమయంలో బయటి నుంచిదోమలు రాకుండా కిటికీలకు, డోర్స్‌కు మెష్ అమర్చుకోవాలి.ఈ దోమ నిల్వ నీటిలో గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డ్రమ్ములు, బ్యారెల్స్ మొదలైన వాటిని బోర్లించి పెట్టాలి. వాడని టైర్లను తడిలేకుండా ఎండలో పడేయాలి. తాగు నీరు కాకుండా మిగతా అవసరాల కోసం వాడే నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. దీనివల్ల ఎడిస్ ఎజిపై్ట గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడూ ఒంటి నిండా ఉండే దుస్తులనే ధరించాలి. హాఫ్ స్లీవ్స్ కంటే ఫుల్ స్లీవ్స్ ఉత్తమం. కాళ్లనూ కవర్చేసే పైజామాలు, సాక్స్ వేసుకుంటే మంచిది. ఏడిస్ ఈజిపై్ట దోమలు ముదురు రంగులకు తేలిగ్గా ఆకర్షితమవుతాయి. కాబట్టి లేత రంగుల దుస్తులను ధరించడం మేలు.పగలు కూడా మస్కిటో రిపల్లెంట్స్ వాడవచ్చు. ఆ రెపల్లెంట్ కంపోజిషన్‌లో పికారిటిన్ లేదా ఆయిల్ ఆఫ్ లెమన్ యూకలిప్టస్ లేదా ఐఆర్ 3535... ఈ మూడింటిలో ఏది ఉన్నా అది వాడవచ్చు. ఈ మస్కిటో రిపల్లెంట్స్ను ప్రతి 4 – 6 గంటలకు ఒకసారి శరీరంపై బట్టలు కప్పని భాగాల్లో స్ప్రే చేసుకోవాలి. ముఖం పైన స్ప్రే చేసుకునే సమయంలో ఇది స్ప్రే కళ్ల దగ్గర స్ప్రే చేసుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. డెంగ్యూకు చికిత్స ఇలా... డెంగ్యూ అనేది వైరస్ కాబట్టి దీనికి నిర్దిష్టమైన మందులు లేవు. కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తుంటారు. అంటే సింప్టమేటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారన్నమాట. రోగిలక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందునుంచి ఓఆర్ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. షాక్‌లోకి వెళుతున్న వ్యక్తికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి.రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణంగా 20 వేల కంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి మరీ తక్కువకు ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోయినప్పుడు ఎప్పుడు వాటిని ఎక్కించాలో డాక్టర్ నిర్ణయిస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా డెంగ్యూ ఎవరికైనా సోకవచ్చు. ముఖ్యంగా గర్భిణీల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వారిలో జ్వరం వస్తే అది డెంగ్యూకావచ్చేమోనని అనుమానించి తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. ఇక్కడ గుర్తుంచుకోడాల్సిన విషయం ఏమిటంటే... సాధారణ జ్వరం వచ్చిన వారికిఇచ్చినట్లుగా డెంగ్యూ బాధితులకు ఆస్పిరిన్, బ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావంఅయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను మరింత పెంచుకున్నట్టే. ఇది చాలా ప్రమాదకరం కాబట్టే ఈ జాగ్రత్త పాటించాలి. అయితే గుండెజబ్బులు ఉన్నవారు ఆస్పిరిన్ మామూలుగానే వాడుతుంటారు. ఇలాంటివారు డెంగ్యూజ్వరం వచ్చినప్పుడు రక్తాన్ని పలచబార్చే మందులు వాడకూడదు. – ప్లేట్లెట్లు లక్ష కంటే తగ్గినప్పుడు ప్రతిరోజూ పరీక్ష చేయించుకోవాలి. అయితే రోజుకు ఒకసారి మాత్రమే ఈ పరీక్ష చేయించుకోవాలి. జ్వరం తగ్గాక ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి పెరిగాక, మళ్లీ తగ్గి, మళ్లీ పెరుగుతాయి. అయితే ప్లేట్లెట్ల సంఖ్య 20,000 కంటే తగ్గితే మాత్రం హాస్పిటల్లో చేరడం అవసరం. ప్రమాద హెచ్చరికలు ఇంట్లో ఎవరైనా విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్తున్నా, మలవిసర్జన నలుపు రంగులో అవుతున్నా, ముక్కులోంచి కానీ, చివుళ్లలోంచి కానీ చర్మంలోపల కానీ బ్లీడింగ్ అవుతున్నా, దాహంతో గొంతెండి పోతున్నా, చెమటలు పట్టి శరీరం చల్లబడిపోయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. -
విద్యార్థినికి డెంగీ లక్షణాలు
గార్లదిన్నె : మండలంలోని ఇల్లూరుకు చెందిన మస్తానయ్య కూతురు లక్ష్మీనరసమ్మ(తొమ్మిదో తరగతి విద్యార్థిని) డెంగీ లక్షణాలతో బాధపడుతోందని స్థానికులు తెలిపారు. పది రోజుల కిందట బాలికకు జ్వరం సోకగా, అనంతపురంలోని పెద్దాస్పత్రిలో చికిత్స చేయించారు. అక్కడ పరీక్షించి వైద్యులు డెంగీ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారని వివరించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. కాగా జిల్లా అదనపు వైద్యాధికారిణి డాక్టర్ పద్మావతి, మలేరియా జిల్లా అధికారి డాక్టర్ దోసారెడ్డి తమ సిబ్బందితో కలసి ఇల్లూరులో గురువారం పర్యటించారు. మస్తానయ్య ఇంటిని పరిశీలించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సూపర్వైజర్ నాగేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ శివయ్య పాల్గొన్నారు. -
డెంగీ లక్షణాలతో బాలుడి మృతి?
పార్వతీపురం : మండలంలోని గోపాలపురంలో డెంగీ లక్షణాలతో బాధపడిన పాలీల లోకేష్(20నెలలు) అనే పసికందు మంగళవారం మృతిచెందాడు. ఈ బాలుడు విశాఖపట్నం ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ మరణించాడు. అయితే ఈ బాలుడు కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో మృతిచెందినట్లు వైద్యపరీక్షల్లో తేలిందని బందలుప్పి పీహెచ్సీ వైద్యాధికారి డా. కృష్ణంరాజు తెలిపారు. గోపాలపురంలో డెంగీ కలకలం అన్న శీర్షికతో ‘సాక్షి’ దినపత్రికలో వెలువడిన కథనంతో బందలుప్పి పీహెచ్సీ అధికారులు, ఈఓపీఆర్డీ కూర్మనాథ్ పట్నాయక్ అప్రమత్తమై గ్రామంలో హుటాహుటిన వైద్యశిబిరం ఏర్పాటు చే శారు. గ్రామంలో కాలువలు, రోడ్లను శుభ్రం చేసే పారిశుద్ధ్య పనులను చేపట్టారు. లోకేష్ మరణ వార్తతో గ్రామస్తుల్లో భయం పుట్టి ప్రతి ఒక్కరూ వైద్యశిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్డీ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఆరుబయట మల విసర్జనను మాని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. -
జ్వరం.. జరభద్రం
డెంగీ ప్రాణాలు తోడేస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. తీవ్రత బయటపడితే.. ఎక్కడ తమ పదవికి ఎసరువస్తుందోనని నాయకులు, అధికారులు తేలు కుట్టిన దొంగల్లాఉన్నారు. ఇక్కడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులుపక్క జిల్లాల వారనే సాకుతో సరిపెడుతున్నారు.వాస్తవానికి.. చాపకింద నీరులా వ్యాపిస్తున్నఈ మహమ్మారి జిల్లాను వణికిస్తోంది. కర్నూలు(జిల్లా పరిషత్):నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల చిన్నపిల్లల విభాగంతో పాటు మెడికల్ వార్డులో వైరల్ ఫీవర్ల సంఖ్య పెరిగింది. ఈ విభాగాలకు రోజూ వచ్చే ఓపీ కేసుల్లో సగం జ్వర పీడితులే ఉంటున్నారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా ఈ వ్యాధి బారిన విలవిల్లాడుతున్నారు. గత మూడు నెలల్లో జిల్లాలో 235 మంది డెంగీ లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. వీరిలో 18 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో 50 మంది చిన్నారులు విషజ్వరాలతో చికిత్స పొందుతున్నారు. మెడికల్ విభాగాల్లోనూ 20 మందికి పైగా జ్వరపీడితులు ఉన్నారు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సగానికి పైగా డెంగీ అనుమానిత రోగులు చికిత్స పొందుతున్నారు. మలేరియా మాసోత్సవం, దోమల నివారణ మాసోత్సవం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. వైద్య ఆరోగ్యశాఖతో మున్సిపల్, పంచాయతీ శాఖల సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. కర్నూలులోడెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్న వారిలో వైఎస్ఆర్ జిల్లా వాసులే అధికంగా ఉన్నారు. కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్లతో పాటు అనంతపురం, తాడిపత్రి నుంచి అధికంగా డెంగీ బాధితులు చికిత్స నిమిత్తం కర్నూలుకు వస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో వీరికి ముందుగా ర్యాపిడ్ టెస్ట్‌లో భాగంగా ఎన్ఎస్ 1 యాంటిజెంట్ పరీక్ష నిర్వహిస్తారు. దీంతో పాటు సిరాలజిలో ఐజిజి, ఐజీఎం కిట్ ద్వారా డెంగీ నిర్ధారణ పరీక్ష చేస్తున్నారు. ప్రాథమికంగా డెంగీ నిర్ధారణ అయితే ఆ మేరకు లక్షణాలను బట్టి చికిత్స నిర్వహిస్తున్నారు. అధికంగా పాజిటివ్ కేసులు కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి విభాగంలో డెంగీ నిర్ధారణకు ఎలీసా టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వెలెన్స్ ప్రాజెక్టు(ఐడీఎస్పీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం డెంగీ నిర్ధారణ ఎలీసా కిట్లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజి(పూణే) నుంచి పంపిణీ చేస్తోంది. వైద్య ఆరోగ్యశాఖాధికారులు సైతం ఇక్కడ పరీక్ష చేస్తేనే సరైన ఫలితంగా నమ్ముతారు. జిల్లాతో పాటు పక్కనున్న కడప, అనంతపురం జిల్లాల నుంచి సైతం మైక్రోబయాలజి విభాగానికి డెంగీ నిర్ధారణకు రక్త నమూనాలను పంపుతున్నారు. గత యేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 781 డెంగీ అనుమానిత కేసులకు పరీక్షలు నిర్వహించగా.. 189 డెంగీ పాజిటివ్‌గా నిర్ధారించారు. ఈ యేడాది జనవరి 20న 92 మంది రక్తపరీక్షలు నిర్వహించగా నలుగురికి, ఏప్రిల్ 29న 92 మందికి గాను 14 మందికి, మే ఒకటిన 92 మందికి గాను ఏడుగురికి, ఈ నెల 6న 92 మందికి గాను 29 మందికి డెంగీ పాజిటివ్ వచ్చింది. 92 మంది పోగైతేనే ఎలీసా టెస్ట్ డెంగీ నిర్ధారణలో కీలకంగా భావిస్తున్న ఎలీసా టెస్ట్ ఒకరో ఇద్దరో వెళితే చేయని పరిస్థితి. మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజీలో ఈ పరీక్ష చేయాలంటే 92 మంది రోగులు పోగవ్వాలి. డెంగీ నిర్ధారణ కిట్ తెరిస్తే ఒకేసారి పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఒక కిట్‌తో 92 మందికి ఒకేసారి పరీక్ష చేసే వీలుంది. అందుకే 92 మంది రోగుల శ్యాంపిల్స్ వచ్చే వరకు ఇక్కడ డెంగీ పరీక్ష నిర్వహించడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 20 నుంచి 60 కేసులకూ పరీక్ష నిర్వహిస్తున్నారు. -
డెంగ్యూకు చెక్!
ఇక డెంగ్యూ మహమ్మారి ఆటకట్టించనున్నారు. దీని ద్వారా మానవ శరీరంలో జరిగే వినాశనాన్ని సమర్థవంతంగా అడ్డుకోగల ప్రతి రక్షకాలను సింగపూర్ చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ఒక్క నిమిషంలోనే డెంగ్యూ వైరస్‌ను చలనం లేకుండా చేసి కట్టిపడేస్తాయని చెప్తున్నారు. సాధరణంగా డెంగ్యూకు ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించబడిన లైసెన్స్ ఉన్న మెడిసినే లేదు. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి 50 ఏళ్లవగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 30కంటే ఎక్కువసార్లు విజృంభించింది. దీనివల్ల తీవ్రమైన, రాషెష్తోపాటు తీవ్రమైన జాయింట్ పెయిన్స్, రక్తస్రావం, షాక్‌కు గురికావడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతుండగా .. సింగపూర్‌లోని డ్యూక్ నాస్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్కూల్‌కు చెందినవారు మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించారు. 200 మంది నుంచి 5 జే7 అనే ప్రతిరక్షకాలను తీసుకుని వాటిద్వారా డెంగ్యూ వైరస్‌పై ప్రయోగించి చూశారు. 10-9 గ్రాముల 5జే7 ప్రతిరక్షకాలతోనే డెంగ్యూ వైరస్ నాశనమైనట్లు తెలిపారు. -
టెన్షన్.. టెన్షన్..
కాకినాడ క్రైం :డెంగీ భూతం జిల్లాను వణికిస్తోంది. వివిధ ప్రాంతాలకు చెందిన 38 మంది డెంగీతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కె.గంగవరం మండలం వాసాలరేవును 20 రోజులుగా జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హడావుడిగా అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డెంగీ అనుమానితుల్ని వెంటనే కాకినాడ ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)కి తరలిస్తున్నారు. మంగళవారం వరకూ జీజీహెచ్‌కు 26 మంది పెద్దలు, తొమ్మిది మంది పిల్లలు వచ్చారు. వారికి మాక్ ఎలీషా టెస్ట్ నిర్వహించగా 22 మంది పెద్దలు, ఎనిమిది మంది పిల్లలకు డెంగీ సోకినట్టు నిర్ధారణ అయింది. కాకినాడలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో ఎనిమిదిమంది డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కాకినాడ రూరల్ మండలం పండూరుకు చెందిన ముగ్గురు, సామర్లకోట మండలం పనసపాడుకు చెందిన ఐదుగురు ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆరుగురు మృతి! డెంగీ లక్షణాలతో ఈ ఏడాది ఇప్పటివరకూ ఆరుగురు మృతి చెందినట్టు అనధికార సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. అయితే అధికారులు ముగ్గురు మాత్రమే మృతి చెందారని చెబుతున్నారు. తాజాగా అల్లవరానికి చెందిన అనంతలక్ష్మి (65) డెంగీ లక్షణాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 13 రాత్రి మృతి చెందింది. అధికార యంత్రాంగంపైవిమర్శల వెల్లువ జిల్లాను డెంగీ భూతం పట్టి పీడిస్తున్నా అధికార యంత్రాంగం సరైన చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాసాలరేవులో పారిశుధ్యం అధ్వానంగా ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే తాగునీరు కలుషితం కావడంతో గ్రామానికి చెందిన సుమారు 70 మంది 20 రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారని చెబుతున్నారు. అయినప్పటికీ వైద్య, ఆరోగ్య, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్న బాధితులు జ్వరంతో బాధపడుతున్న చాలామంది ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉన్న ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి, ఆరోగ్య కేంద్రాల్లో వారిని పరీక్షించి డెంగీ సోకినట్టు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్యాధికారులు మందులు అందిస్తున్నారు. అయితే వాటిని వాడవద్దని కొంతమంది ఆర్ఎంపీలు చెప్పడంతో రోగులు ఆ మందులు వాడడంలేదు. దీంతో వారికి ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతోంది. అటువంటి ఆర్ఎంపీలను నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల్లో ఖర్చు ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ చికిత్సకు సుమారు రూ.2 లక్షలు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఖరీదైన యాంటీబయాటిక్స్‌కు, ప్లేట్స్‌లెట్స్ ఎక్కించడానికి లక్షల్లో ఖర్చవుతుందని చెబుతున్నారు. డెంగీకి పూర్తి స్థాయి వైద్యం కాకినాడ జీజీహెచ్‌లో అందుబాటులో ఉంది. దీనిపై అవగాహన లేకపోవడంతో పేద, మధ్యతరగతివారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు.