డిప్యూటీ సీఎం ఇంటిని ముట్టడించిన రేషన్ డీలర్లు
-
అడ్డుకున్న పోలీసులు
-
ఇంటి ముందు బైఠాయించి నిరసన
హన్మకొండ : తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు రూ. 20 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు మంగళవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంటిని ముట్టడించారు. న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని కోరుతూ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేష్, ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డీలర్లు హన్మకొండ టీచర్స్‌కాలనీలోని డిప్యూటీ సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరారు. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు కడియం శ్రీహరి ఇంటి వద్దకు చేరుకుంటున్న డీలర్లను అడ్డుకున్నారు. అయితే తాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడమని, శాంతియుతంగా నిరసన తెలుపుతామని డీలర్లు పోలీసులకు తెలిపి వారు అక్కడికి చేరుకున్నారు.
అనంతరం డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి నేరుగా డీలర్ల వద్దకు వచ్చి వారి డిమాండ్లు తెలుసుకుని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు వెళ్లిపోయారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పోతురాజు రమేష్, డీలర్లు గోపాల్‌రావు, లింగయ్య, వీరన్న, రాథకృష్ణ, మహేష్, మోహన్, సంధ్యారెడ్డి పాల్గొన్నారు.
దీక్ష శిబిరాన్ని సందర్శించిన నాయకులు హన్మకొండ ఏకశిల పార్కు వద్ద చేపట్టిన రేషన్ డీలర్ల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతి కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకుడు ఈవీ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు దీక్ష చేపట్టిన బత్తుల రమేష్‌బాబు, చిలగాని మోహన్‌కు సంఘీబావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం చొరవ చూపి డీలర్ల కోర్కెలు నెరవేర్చాలని కోరారు. కాగా, జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, దుగ్గొండి జెడ్పీటీసీ సభ్యుడు సుకినే రాజేశ్వర్‌రావు కూడా దీక్షలకు సంఘీభావం తెలిపారు.