
‘కమలం’ అభ్యర్థిగా దేవయ్య
బీజేపీ ఎన్నికల కమిటీ నిర్ణయం...
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఎట్టకేలకు బీజేపీ తన అభ్యర్థిని తేల్చింది. డాక్టర్ పగిడిపాటి దేవయ్య పేరును ఖరారు చేస్తూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో దేవయ్య పేరును పార్టీ అభ్యర్థిగా పార్టీ జాతీయ ఎన్నికల కమిటీకి నివేదించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర ఎన్నిక కమిటీ పార్టీ కార్యాలయంలో సోమవారం సమావేశమైంది. దేవయ్య అభ్యర్థిత్వంపై మిత్రపక్షమైన టీడీపీతో అంతకుముందుగానే చర్చించారు. దేవయ్యతోపాటు చింతా స్వామి, డాక్టర్ ఎ.చంద్రశేఖర్, రాజమౌళి తదితరుల పేర్లపై పార్టీ ఎన్నికల కమిటీ చర్చించింది. వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత మాదిగ సామాజిక వర్గానికి చెందిన దేవయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారుచేసింది.
బయోడేటా
పేరు: పగిడిపాటి దేవయ్య
వృత్తి: వైద్య నిపుణుడు (హార్వర్డ్
యూనివర్సిటీ వైద్య పట్టా)
తల్లిదండ్రులు: కోటమ్మ, రత్నం
(11 మంది తోబుట్టువుల్లో చిన్నవాడు)
స్వగ్రామం: ఖిలాషాపూర్
(వరంగల్ జిల్లా)
నివాసం: ఫ్లోరిడా (అమెరికా)
భార్య: రుద్రమదేవి (డాక్టర్)
పిల్లలు: ఇద్దరు కుమారులు (సిద్ధార్థ, రాహుల్‌దేవ్), ఒక కుమార్తె (సృజన)