అభివృద్ధి పనుల్లో ప్రజాప్రతినిధులు సహకరించాలి
Published Fri, Jul 29 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్
కాకినాడ సిటీ:
అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని, తద్వారా ప్రజలకు వాటి ఫలితాలు అందుతాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు తెలిపారు. గురువారం అంబేడ్కర్ భవన్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర శాఖల నిధుల అనుసంధానంతో చేపట్టే పనులపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ మొదటి విడతగా అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు, గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రెండో విడతగా పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు సర్పంచ్‌ల ఆధ్వర్యంలో అవగాహన ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలపై వారికి అవగాహన ఉండాలని, నిధుల కేటాయింపు, చేసిన ఖర్చుపై అవగాహన ఉంటేనే అభివృద్ధి సాధించగలమన్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ఉపాధి హామీ పథకం నిధులు ఇస్తామన్నారు. ఈ పథకంలో గత సంవత్సరం రూ.280 కోట్లు ఖర్చు చేయగా, ఈ సంవత్సరం 25 శాతం ఎక్కువ నిధులు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, డీపీఓ శర్మ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఎం.రాజేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె.పద్మ ప్రసంగించారు. సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement