టీడీపీలో ‘దేవినేని’చిచ్చు! | devineni nehru back to tdp | Sakshi
Sakshi News home page

టీడీపీలో ‘దేవినేని’చిచ్చు!

Published Tue, Aug 30 2016 11:57 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

టీడీపీలో ‘దేవినేని’చిచ్చు! - Sakshi

టీడీపీలో ‘దేవినేని’చిచ్చు!

చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ ఏమీటీ?

విజయవాడ :  మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్‌ (నెహ్రూ) మంగళవారం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అనంతరం పార్టీలో చేరినట్లు ప్రకటించారు. జిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన నెహ్రూ తన కుమారుడు దేవినేని అవినాష్‌ భవిష్యత్తు కోసం తాను సుదీర్ఘకాలంపాటు వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీలోనే చేరారు. పార్టీ నుంచి ఏమీ ఆశించకుండానే చేరుతున్నానని దేవినేని నెహ్రూ చెబుతున్పప్పటికీ ఆయన కుమారుడు విషయంలో ఏదో స్పష్టమైన హామీ లభించి ఉండవచ్చని ఆయన వర్గం అభిప్రాయపడుతోంది. అవినాష్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు హామీ ఇవ్వడం వల్లనే పార్టీలో చేరారని చెబుతున్నారు. 


ఎన్టీఆర్‌ మరణంతో పార్టీకి దూరం....
ఎన్టీఆర్‌ తెలుగుదేశంపార్టీ పెట్టినప్పుడు కృష్ణాజిల్లా నుంచి చేరిన తొలి నేతల్లో దేవినేని నెహ్రూ ఒకరు. ఎన్టీఆర్‌ బతికున్నంత వరకు ఆయన్ను వెన్నంటి ఉన్నారు. ఆయన మరణానంతరం లక్ష్మీపార్వతి వెంట ఎన్టీఆర్‌ తెలుగుదేశంలో చేరారు. ఆ పార్టీ కనుమరుగు కావడంతో లక్ష్మీపార్వతి అనుచరులు టీడీపీలోకి వెళ్లినా చంద్రబాబు వ్యవహారశైలి నచ్చక నెహ్రూ కాంగ్రెస్‌ తీర్ధం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ పలు సందర్భాల్లో ఘాటుగా విమర్శలు చేసిన దేవినేని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. 
 
టీడీపీ నేతలతో విభేదాలు..
దేవినేని నెహ్రూకు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులతో విభేదాలు ఉన్నాయి. పెనమలూరు ఎమ్మెల్యే  బోడే ప్రసాద్‌కు దేవినేని నెహ్రూ వర్గానికి ఇసుక వార్‌ జరగుతోంది. బోడే ప్రసాద్‌ నియోజకవర్గంలో ఇసుక దందా చేస్తుంటే.. ఆయనకు ధీటుగా నెహ్రూ వర్గం కూడా ఇసుక రవాణాకు సిద్ధమౌతోంది. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు దేవినేని నెహ్రూ మధ్య విభేదాలు ఉన్నాయి. గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని వంశీమోహన్, దేవినేని నెహ్రూల మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం గతంలో సాగింది. ఇక జిల్లా మంత్రి దేవినేని ఉమాను ఆంధ్రరత్నభవన్‌ వేదికగా నెహ్రూ పలుమారు విమర్శలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. 
 
ఎవరి పదవికి ఎసరు!?
దేవినేని రాజశేఖర్‌ (నెహ్రూ) టీడీపీలో చేరడం ఆ పార్టీలో పెద్ద చర్చనీయాశంగా మారింది. నియోజకవర్గాల పునః విభజన జరిగే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరు తమ సీటు కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన కంకిపాడు నియోకవర్గంలో ఎక్కువ భాగం పెనమలూరులో ఉంది. అందువల్ల ఆయన ఆ సీటు కోరవచ్చు. లేదా ఆయన ఇల్లు తూర్పు నియోజకవర్గంలో ఉన్నందున విజయవాడ తూర్పు ఇవ్వమని డిమాండ్‌ చేయవచ్చు. గన్నవరం సీటు కోరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు. నూజీవీడు సీటు నెహ్రూ తనయుడుకు పార్టీ కేటాయించే అవకాశాలు లేకపోలేదు. 
 
ఒకే గూటిలో దేవినేని కుటుంబం
దేవినేని నెహ్రూ టీడీపీలో చేరడం వెనుక మంత్రి దేవినేని ఉమా హస్తం ఉందని టీడీపీలో ఆయన వ్యతిరేక వర్గం బాగా నమ్ముతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ను పార్టీలోకి తీసుకువస్తే జిల్లాలో తమ పట్టుమరింత పెంచుకోవచ్చని మంత్రి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇదే కుటుంబానికి చెందిన మరోక యువ నాయకుడు తెలుగుయువతలో  పనిచేస్తున్నారు. దేవినేని కుటుంబమంతా టీడీపీ గూటిలోనే ఉన్నట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement