కాసుల కోసం కక్కుర్తి
కాసుల కోసం కక్కుర్తి
Published Mon, Aug 15 2016 6:28 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
* సాధారణ భక్తులకు చుక్కలు
* అమరేశ్వరాలయంలో ఉచిత దర్శనానికి వెళ్తే పాట్లే
* టికెట్ కొనుగోలు దర్శనానికే ప్రాధాన్యం
అమరావతి (పట్నంబజారు): కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగనివ్వం.. దేవాదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాధికారులు గత ఆరు నెలలుగా సమీక్షలు, సమావేశా ల్లో చెప్పిన మాటలివి. అయితే అందుకు పూర్తి భిన్నంగా అమరావతిలో పరిస్థితులు నడుస్తున్నాయి. సామాన్య భక్తులు అమరేశ్వరుని దర్శనం అంటనే భయపడాల్సి వస్తోంది. అమరావతిలో ఫుష్కర స్నానాలు ఆచరించేందుకు ఆదివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్నా నాలు చేసిన అనంతరం అమరేశ్వరుని దర్శనం కోసం ఆలయ ప్రాంగణానికి రా గానే కష్టాలు ప్రారంభమవుతున్నాయి. ఉచిత దర్శనం క్యూలైను వద్ద దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు, సిబ్బందే స్వయంగా ఈ దర్శనం ఆలస్యమవుతోం దని చెబుతున్నారు. త్వరగా దర్శనం అవ్వాలంటే రూ.100, రూ.300 టికెట్లు కొనుగోలు చేయాలని సూచించటం గమనార్హం. అయినా ఉచిత దర్శనానికి వెళితే ఇక అంతే సంగతులు. కనీసం మూడు గంటలకు పైగా క్యూలైనులో పడిగాపులు కాయాల్సిందే. డబ్బులు చెల్లించే వారికి మాత్రమే త్వరగా దర్శనం చేయిస్తూ...ఉచిత దర్శనం క్యూను మాత్రం నిలిపివేయటంపై భక్తులు మండిపడుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చామని, అంతంత చెల్లించి టికెట్‌లు కొనుగోలు చేయలేమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీసం మ్యాట్‌లు లేవు...
ఉచిత క్యూలైనులో వచ్చే భక్తులపై అధికారులు చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారు. భక్తులు వెళ్లే క్యూలైనులో రాళ్లు, రప్పలు ఉన్నా.. కనీసం మ్యాట్‌లు కూడా వేయకపోవటం శోచనీయం. అదే టికెట్ కొనుగోలు చేసినవారి క్యూలైన్లలో మాత్రం సకల సౌకర్యాలు కల్పించారు. అధికారుల తీరుపై పేద భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేనిపోని ఆర్భాటపు ప్రకటనలు చేసి, తీరా ఇక్కడికి వచ్చిన తరువాత ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు.
Advertisement