పుష్కర స్నానానికి వెళ్లి తిరిగొస్తూ..
పుష్కర స్నానానికి వెళ్లి తిరిగొస్తూ..
Published Tue, Aug 23 2016 7:51 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
ప్రమాదానికి గురైన ప్రయాణికుల కారు
ఒకరు మృతి .. ముగ్గురికి తీవ్ర గాయాలు
పెదనందిపాడు (వరగాని) : కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చినగంజాంకు చెందిన మోటుమర్రి రామసుబ్బారావు.. అతని భార్య రాజ్యలక్ష్మి, కుమార్తె బబిత, స్నేహితుడు శంకరమంచి మధుబాబు కారులో విజయవాడ పుష్కర స్నానానికి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో పెదనందిపాడు మీదుగా చినగంజాం వెళ్తున్నారు. మండలంలోని వరగాని వద్ద కాటన్ మిల్ సమీపంలోకి రాగానే కారు ఎదురుగా ఉన్న చెట్టును వేగంగా ఢీకొట్టి పక్కనే ఉన్న మేకలవాగులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రై వరు ఎం. సుబ్బారెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న శంకరమంచి మధుబాబు, రామ సుబ్బారావులకు తల, కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. రాజ్యలక్ష్మి కుడి కాలుకు, చేతికి గాయాలయ్యాయి. ప్రమాదం చూసిన స్థానికులు కాల్వలోకి దూకి క్షత్రగాత్రులను ఒడ్డుకు తీసుకొచ్చారు. స్థానిక ఆర్‌ఎంపీ డాక్టర్ అలీ ప్రమాద స్థలికి చేరుకుని క్షత్రగాత్రులకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం 108 వాహనంలో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. డ్రై వరు నిద్రమత్తు వల్లనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సుబ్బారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement