
మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు రాజన్న
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు సారవపై నుంచి కింద పడడంతో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బుధవారం మదనపల్లెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రాజన్న(50)కు తలిదండ్రులతో పాటు భార్య నాగరత్నమ్మ, కుమార్తె లక్ష్మి, ఏడవ తరగతి చదువుతున్న పవన్‌కుమార్ ఉన్నారు. ఏడాదిక్రితం బతుకుదెరువు కోసం మదనపల్లెకు వలస వచ్చాడు. నీరుగట్టువారిపల్లెలోని మాయా బజారులో ఓ అద్దె ఇంట ఉంటూ స్థానికంగా భవన నిర్మాణ పనులకు వెళ్లేవాడు.
ఈ నేపథ్యంలో నీరుగట్టువారిపల్లె సమీపంలోని కొత్త బైపాసు రోడ్డులో మోహన్ ఇంటి నిర్మాణ పనులు చేయడానికి సహచర కూలీలతో వెళ్లాడు. అక్కడ సారవపైకి ఎక్కి ఇంటికి ప్లాస్టింగ్ పనులు చేస్తుండగా సారవకొయ్య పక్కకు జరిగి, అది కూలడంతో రెండవ అంతస్తు నుంచి సరాసరి రాజన్న గేటుపై పడ్డాడు. దీంతో పక్కటెముకలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో సహచరులు అతడిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజన్న చనిపోయాడని నిర్థారించారు.
సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ రాజేంద్రయాదవ్, ఎస్‌ఐ సునీల్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇక మాకు దిక్కెవరయ్యా?ఇక మాకు దిక్కెవరయ్యా..? అంటూ మృతుడు రాజన్న భార్య తన పిల్లలతో గుండెలవిసేలా రోదించడం చూపరులను కలచివేసింది. తాడిపత్రి నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఒంటరి చేసి పోతివా? అంటూ కన్నీమున్నీరయ్యారు.