Amareswara temple
-
నమ్మకాన్ని అమ్ముకుంటున్నారు!
నాసిరకంగా అమరేశ్వరుని లడ్డు ప్రసాదం నిగ్గుతేల్చిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు హైదరాబాద్కు నమూనాలు పంపిన అధికారులు పట్నంబజారు (అమరావతి) : పంచారామాల్లో ఒకటైన అమరావతి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు లడ్డూల తయారీలో చేతివాటాన్ని ప్రదర్శించారు. నాసిరకం లడ్డూలు తయారుచేసి భక్తులకు ఒక్కొక్కటి పది రూపాయల చొప్పున అమ్మారు. దేవాదాయ శాఖ అధికారులు పుష్కరాలు 12 రోజులకు సరిపడా సుమారు 50 వేల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచారు. గడిచిన పది రోజుల్లో సుమారు 3 నుంచి 4 లక్షల లడ్డూలను విక్రయించారు. ఆహార భద్రత అధికారులు రెండు రోజుల క్రితం లడ్డూల తయారీ కేంద్రాన్ని పరిశీలించి కంగుతిన్నారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా..లడ్డూలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. కేవలం రూపాయి కూడా విలువ చేయని పదార్ధాలను వినియోస్తున్నారని సమాచారం. ఆహార భద్రత అధికారుల దాడుల నేపథ్యంలో అధికారపార్టీకి చెందిన నియోజకవర్గ నేత ఫుడ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో లడ్డూ మాఫియా..? స్థానికంగా కొంతమంది పెద్దల నేతృత్వంలో లడ్డూల మాఫియా జరుగుతోందని సమాచారం. ఎక్కడబడితే అక్కడ స్వామివారి ఫొటోతో ఉన్న కవర్లు తయారు చేసి బయట తయారు చేసిన లడ్డూలు అమ్ముతున్నారని తెలుస్తోంది. దీనిని నియంత్రించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖాధికారులపైనే ఉంది. కానీ పెద్దమొత్తంలో చేతులు తడుపుతుండడంతో అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. -
అమరేశ్వరుని దర్శించిన అఘోరాలు
అమరావతి (పెదకూరపాడు) : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో అమరావతిలోని అమరేశ్వరాలయాన్ని శ్రీశైలానికి చెందిన అఘోరాలు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారుల కమిటీ వారికి ఘన స్వాగతం పలికింది. అఘోరాలు ఆలయంలో మూడు ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకున్నారు. పుష్కరాల నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా అఘోరాలు ఇక్కడికి వచ్చినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. -
కాసుల కోసం కక్కుర్తి
* సాధారణ భక్తులకు చుక్కలు * అమరేశ్వరాలయంలో ఉచిత దర్శనానికి వెళ్తే పాట్లే * టికెట్ కొనుగోలు దర్శనానికే ప్రాధాన్యం అమరావతి (పట్నంబజారు): కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగనివ్వం.. దేవాదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాధికారులు గత ఆరు నెలలుగా సమీక్షలు, సమావేశా ల్లో చెప్పిన మాటలివి. అయితే అందుకు పూర్తి భిన్నంగా అమరావతిలో పరిస్థితులు నడుస్తున్నాయి. సామాన్య భక్తులు అమరేశ్వరుని దర్శనం అంటనే భయపడాల్సి వస్తోంది. అమరావతిలో ఫుష్కర స్నానాలు ఆచరించేందుకు ఆదివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్నా నాలు చేసిన అనంతరం అమరేశ్వరుని దర్శనం కోసం ఆలయ ప్రాంగణానికి రా గానే కష్టాలు ప్రారంభమవుతున్నాయి. ఉచిత దర్శనం క్యూలైను వద్ద దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు, సిబ్బందే స్వయంగా ఈ దర్శనం ఆలస్యమవుతోం దని చెబుతున్నారు. త్వరగా దర్శనం అవ్వాలంటే రూ.100, రూ.300 టికెట్లు కొనుగోలు చేయాలని సూచించటం గమనార్హం. అయినా ఉచిత దర్శనానికి వెళితే ఇక అంతే సంగతులు. కనీసం మూడు గంటలకు పైగా క్యూలైనులో పడిగాపులు కాయాల్సిందే. డబ్బులు చెల్లించే వారికి మాత్రమే త్వరగా దర్శనం చేయిస్తూ...ఉచిత దర్శనం క్యూను మాత్రం నిలిపివేయటంపై భక్తులు మండిపడుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చామని, అంతంత చెల్లించి టికెట్లు కొనుగోలు చేయలేమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మ్యాట్లు లేవు... ఉచిత క్యూలైనులో వచ్చే భక్తులపై అధికారులు చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారు. భక్తులు వెళ్లే క్యూలైనులో రాళ్లు, రప్పలు ఉన్నా.. కనీసం మ్యాట్లు కూడా వేయకపోవటం శోచనీయం. అదే టికెట్ కొనుగోలు చేసినవారి క్యూలైన్లలో మాత్రం సకల సౌకర్యాలు కల్పించారు. అధికారుల తీరుపై పేద భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేనిపోని ఆర్భాటపు ప్రకటనలు చేసి, తీరా ఇక్కడికి వచ్చిన తరువాత ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు.