పుష్కర యాత్ర విషాదాంతం | road accident filed | Sakshi
Sakshi News home page

పుష్కర యాత్ర విషాదాంతం

Published Tue, Aug 23 2016 9:17 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

పుష్కర యాత్ర విషాదాంతం - Sakshi

పుష్కర యాత్ర విషాదాంతం

 స్క్రూబ్రిడ్జి మీది నుంచి సర్వీసు
 రోడ్డులోకి కారు పల్టీ 
 ఇద్దరి దుర్మరణం.. ఆరుగురికి తీవ్ర గాయాలు
 బాధితులు శ్రీకాకుళంవాసులు 
 
విజయవాడ (ఆటోనగర్‌):
 పుష్కర స్నానం అయ్యింది, అమ్మవారి దర్శనం ముగిసింది... ఆ సంతోషంతో ఇంటి ముఖం పట్టారు.  ఇంతలోనే మృత్యువు ప్రమాదరూపంలో వెంటాడింది. వేగంతో వస్తున్న కారు అదుపు తప్పి బ్రిడ్జి గోడను బద్ధలు కొడుతూ కిందనున్న సర్వీసురోడ్డు మీదకు పడింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఆరుగురు గాయలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  బెంజ్‌సర్కిల్‌కు సమీపంలో జరిగిన ఘటనతో అందరూ ఉలిక్కిపడ్డారు. 
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తొరుపి గ్రామానికి చెందిన అప్పాయమ్మ ఆమె కుమారులు పైడి అప్పలనాయుడు అతని భార్య శారద, వారి పిల్లలు మహేష్, సూర్య, మరో కుమారుడు పైడి వెంటకరమణ, కుమార్తె భూలక్ష్మి, భూలక్ష్మి కుమారుడు హర్షవర్థణŠ  మొత్తం కలిపి ఎనిమిది మంది కలిసి మారుతీ స్విప్ట్‌ కారు(ఏపి30 పి4789)లో విజయవాడకు మంగళవారం తెల్లవారుజామున వచ్చారు. పుష్కర స్నానం ముగించుకుని  తిరుగుపయ్రాణమై స్క్రూ బ్రిడ్జి సెంటర్‌కు చేరుకోగానే కారు వేగంతో ఉండటంతో అదుపు తప్పింది. దీంతో బ్రిడ్జి గోడను ధ్వంసం చేసుకొని దాదాపు ఆరు అడుగుల కిందనున్న సర్వీస్‌ రోడ్‌లోకి బోల్తాకొట్టింది. దీంతో డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్న వెంకటరమణ (40), పక్క సీటులో ఉన్న హర్షవర్థన్‌ (11) కారులోనే తీవ్రగాయాలతో దుర్మరణం పాలయ్యారు. మిగతా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిబాబు ఉన్నారు. మరో చిన్నబ్బాయి సురక్షితంగా బయటపడ్డాడు. 
 
సహయచర్యల్లో స్థానికులు..
ఘటన చూసిన స్థానికులు వెంటనే కారు డోర్లు లాగి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే డోర్లు లాక్‌ కావడంతో కారు అద్దాలు పగలకొట్టి ఒక్కొక్కరినే బయటకు తీశారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రైవేట్, ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి రెండు మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సబ్‌కలెక్టర్‌ సృజన, డీటీసీ మీరా ప్రసాద్‌ సంఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యల్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన చోట ఉన్న సీసీ కెమెరాల్లో కారు ప్రమాదం చిత్రాలను సేకరించారు. కారు అతి వేగంతో రావటం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధరించారు. మృతి చెందిన వెంటక రమణ కాంట్రాక్టర్‌ కాగా, అతని సోదరుడు అప్పలనాయుడు సిఆర్‌పిఎఫ్‌లో జవాను. కారు కింద పడ్డ సమయంలో అక్కడ ఇతర వాహనాలు, మనుషులు ఉంటే మరో పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. ట్రాఫిక్‌ పోలీసులను వేరే ఇతర కార్యక్రమాలకు మళ్లించడంతో స్కూబ్రిడ్జి వద్ద పర్యవేక్షణ లేకపోవడం దుర్ఘటనకు ఒక కారణమని స్థానికులు చెబుతున్నారు. 
 
మంత్రుల పరామర్శ 
ఘటనలో తీవ్రంగా గాయపడిన అపాయమ్మ పరిస్థితి విషయంగా ఉంది. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సంఘనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రుల్లో క్షతగాత్రులను రవాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావు పరామర్శించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement