ధరలేక దిగాలు
నల్లజర్ల : మార్చి నెల ముగుస్తున్నా నిమ్మ ధరలు పెరగకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయానికి కిలో రూ.40కి పైగా ఉండగా ప్రస్తుతం కిలో రూ.28 నుంచి రూ.32 మాత్రమే పలుకుతున్నాయి. నిమ్మకాయలకు వేసవి కాలమే ప్రధాన సీజన్ మిగిలిన కాలంలో పెద్దగా ధర రాదు. ఆ సమయంలో పంట పెట్టుబడులకు సరిపోతుంది. వేసవిలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో అమ్మకాలపైనే రైతులకు లాభాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది మార్చి నెల ముగింపు దశకు వచ్చినా ధరలో పెద్దగా మార్పు లేకపోవడంతో నష్టపోతున్నట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. వచ్చే నెల నాటికి ధర పెరగకపోతే ఈ ఏడాది తీవ్రంగా నష్టపోతామని చెబుతున్నారు. నల్లజర్ల నిమ్మ మార్కెట్ నుంచి నిత్యం 200 బస్తాల వరకు ఇతర రాష్ట్రాలకు నిమ్మకాయలు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడి నుంచి గయ, వారణాసి తదతర ప్రాంతాలకు ఎగుమతులు బాగానే జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనై ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నట్టు మార్కెట్ నిర్వాహకుడు పాతూరి చిన్నబ్బాయి తెలిపారు.