వేలికొసలపై లక్షల గ్రంథాలు
వేలికొసలపై లక్షల గ్రంథాలు
Published Fri, Apr 28 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM
-అందుబాటులోకి తెచ్చిన జాతీయ డిజిటల్ లైబ్రరీ
-విభిన్నాంశాలపై 68 భాషల్లో 76.71 లక్షల పుస్తకాలు
బిక్కవోలు (అనపర్తి) : ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం. విద్య, విజ్ఞానం, ఆధ్యాత్మికత, కాలక్షేపానికి పుస్తక పఠనం చేసేవారు చాలా మందే ఉన్నారు. కాగితం ధర పెరిగిపోవడంతో పుస్తకాల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పుస్తకాల కొనుగోలు భారంగా మారుతోంది. ఆర్థిక స్థితి బాగున్నవారు పుస్తకాలను కొంటుండగా, కొందరు అద్దెకు తీసుకుంటుంటారు. అయితే ఇప్పడు పైసా ఖర్చులేకుండా లక్షల పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్లు, కంప్యూటర్‌తో నిరంతరం కాలం గడుపుతున్న ప్రజానీకానికి అన్నీ డిజిటల్ రూపాల్లోనే అందించాలనే లక్ష్యంతో నేషనల్ డిజిటల్ లైబ్రరీని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇది మన వేలికొసలతో తెరవగల గ్రంథాలయం లాంటిది. ప్రస్తుత వేసవి సెలవులను పుస్తక పఠనం ద్వారా విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే మంచిది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఖరగ్‌పూర్ ఐఐటీ సమన్వయంతో ప్రాథమిక విద్య నుంచి పీజీ స్థాయి వరకూ అవసరమైన విజ్ఞాన సంపదను ఇందులో నిక్షిప్తం చేశారు. వివిధ రకాల పోటీ పరీక్షలు, ఉమ్మడి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ డిజిటల్ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన వివరాలు..
68 భాషల్లో పుస్తకాలు..
స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లలో ఈ వెబ్‌సైట్‌ను వినియోగించవచ్చు. గతేడాది ఫ్రిబవరిలో ఈ లైబ్రరీకి రూపకల్పన చేశారు. ఇప్పటి వరకు 76.71 లక్షల పుస్తకాలను ఇందులో పొందుపరిచారు. ఆంగ్గం, హిందీతో పాటు మొత్తం 68 భాషల్లో పుస్తకాలు, సమాచారం లభ్యమవుతున్నాయి.
ఉచిత సభ్యత్వం ఇలా..
ఈ గ్రంథాలయం నుంచి సమాచారాన్ని పైసా ఖర్చు లేకుండా పొందవచ్చు. గూగుల్ సెర్చి ఇంజిన్‌లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ‘ఎన్‌డీఎల్.ఐఐటీకెజీపీ.ఏసీ.ఇన్’ ప్రత్యక్షమవుతుంది. అందులోకి మెంబర్ లాగిన్ క్లిక్ చేయగానే మీ ఈ మెయిల్ అడుగుతుంది. ఇది నమోదు చేయగానే ఆ వెబ్‌సైట్ నుంచి ఆరు అంకెల పాస్‌వర్డ్ కనిపిస్తుంది. అది నమోదు చేయగానే సభ్యులుగా చేరినట్లు సమాచారం అందుతుంది.
అంశాల వారీగా..
విద్యకు సంబంధించిన అన్ని రకాల పాఠ్యాంశాలు, సామాజిక అంశాలు, వార్తలు, కార్యక్రమాలు, ఆర్టికల్స్, పోటీ పరీక్షలకు మెటీరియల్, వీడియో, ఆడియో పాఠాలు, ప్రశ్నలు, సమాధానాలు, వెబ్ కోర్సులు, పరిశోధనలు, అనేక రకాల విజ్ఞానదాయక పుస్తకాలు డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. 3 లక్షల మంది రచయితలు రాసిన ఏడు లక్షల పుస్తకాలు, 2 లక్షల మంది వివిధ అంశాలపై రాసిన 3 లక్షల క«థనాలున్నాయి. దేశంలోని విశ్వ విద్యాలయాలు సమకాలీన అంశాలపై చేసిన 95 వేలకు పైబడిన పరిశోధనల ఆవిష్కరణలు, ప్రముఖుల రచనలను పొందుపరిచారు. వివిధ రకాల ప్రశ్నా పత్రాలు, సందేహాలు, నిపుణుల సమాధానాలు, వ్యవసాయం, నిపుణుల సమాధానాలు లభ్యమవుతున్నాయి, వ్యవసాయం, భౌతిక, శాస్త్ర సాంకేతిక అంశాలపై వెబ్ కోర్సులు ఉన్నాయి.
వేసవి సెలవుల్లో ఉపయోగకరం..
వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువత ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచ విజ్ఞానం సొంతమవుతుంది. ప్రస్తుతం వివిధ పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో ఈ ల్రైబరీ ఎంతో ఉపయోగపడుతుంది. వివిధ రంగాల్లో రాణించాలకునే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, శాస్త్రసాంకేతిక పరిశోధనా రంగంలో ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.
సద్వినియోగం చేసుకోవాలి
చిన్ననాటి నుంచే పుస్తకం పఠనం అలవాటు చేసుకోవాలి. వేసవి సెలవుల్లో ఎండల్లో తిరగకుండా విద్యార్థులు ఇంట్లోనే డిజిటల్ లైబ్రరీ ద్వారా పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి.
వైబీఎస్ ఆచార్యులు, ఉపాధ్యాయుడు, అనపర్తి
ఎంతో ప్రయోజనకరం
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నతస్థాయి కోసం చదివే వారికి డిజిటల్ లైబ్రరీ ఎంతో ప్రయోజనకరం. అనేక రకాల పుస్తకాలను అంతర్జాలంలో అందుబాటులోకి తేవడం సంతోషకరం, ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని లక్ష్యాలు సాధించుకోవాలి.
-పోకల విజయభాస్కర్, ఎంపీడీఓ, బిక్కవోలు
Advertisement
Advertisement